కొవిడ్ మహమ్మారి నేపథ్యంలో ఈనెల ఏడో తేదీ నుంచి ప్రారంభం కానున్న వర్షాకాల సమావేశాలకు పూర్తి స్థాయి జాగ్రత్తలు తీసుకోనున్నారు. కొవిడ్ నెగిటివ్‌గా తేలిన వారిని మాత్రమే శాసనపరిషత్తు, శాసనసభ ప్రాంగణాల్లోకి అనుమతించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇందులో భాగంగా సభ్యులందరూ విధిగా పరీక్షలు చేయించుకునేలా చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అధికారులు, అసెంబ్లీ సిబ్బంది, మంత్రుల వెంట వచ్చే వ్యక్తిగత సిబ్బంది సహా అందరికీ కొవిడ్ పరీక్షలు తప్పనిసరి చేయవచ్చని తెలుస్తోంది.
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరికీ కరోనా పరీక్షలు..! - telangana mlas corona test
కరోనా నేపథ్యంలో పూర్తిస్థాయిలో ముందుజాగ్రత్త చర్యలతో అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు రంగం సిద్ధమవుతోంది. సభ్యులందరికీ కొవిడ్ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. నెగిటివ్‌గా తేలిన వారిని మాత్రమే శాసన పరిషత్తు, శాసనసభ ప్రాంగణంలోకి అనుమతించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉన్నతాధికారులతో ఇవాళ జరగనున్న సమావేశాల్లో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
కొవిడ్ నిబంధనలకు లోబడి సభ్యుల మధ్య భౌతిక దూరం ఉండేలా అదనపు సీట్లను ఏర్పాటు చేశారు. అటు శాససపరిషత్తు, శాసనసభ ప్రాంగణాల్లో ఆటోమెటిక్ థర్మల్ స్కానర్లు, శానిటైజర్లను ఏర్పాటు చేయనున్నారు. కషాయం, వేడినీటిని కూడా అందించే అవకాశం ఉంది. సందర్శకులకు అనుమతి ఇవ్వడం లేదు. అన్ని శాఖల అధికారులు సభకు రాకుండా కేవలం అవసరం ఉన్నవారు మాత్రమే వచ్చేలా చర్యలు తీసుకొనున్నారు. ప్రశ్నోత్తరాలను కొనసాగించే అవకాశం ఉంది. అయితే ప్రశ్నల సంఖ్య కొంత తగ్గవచ్చని అంటున్నారు.
ఉన్నతాధికారులతో సమావేశం
సమావేశాల నిర్వహణకు సంబంధించి శాసనపరిషత్తు ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఉన్నతాధికారులతో ఇవాళ సమావేశం కానున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సహా ఇతర అధికారులు సమావేశంలో పాల్గోనున్నారు. వైద్య, ఆరోగ్య శాఖ, జీహెచ్ఎంసీ అధికారులను కూడా సమావేశానికి పిలిచారు. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఏర్పాట్లు, తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చిస్తారు. సమావేశాల భద్రతపై పోలీసు అధికారులతోనూ సభాపతులు ఇవాళ సమావేశం కానున్నారు.