పొక్సో చట్టాన్ని పటిష్ఠం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. రాష్ట్రవ్వాప్తంగా నమోదయ్యే కేసులను హైదరాబాద్ నుంచే పర్యవేక్షణ, సహకారం అందించాలని నిర్ణయించింది. రాజధానిలో మహిళా భద్రత విభాగం సిబ్బంది క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్‌వర్క్ సిస్టమ్ డేటాను పరిశీలిస్తూ పోక్సో కేసుల గురించి ఆరా తీస్తారు. కేసు తీవ్రతను అనుసరించి దర్యాప్తు అధికారులకు తగు సూచనలు చేస్తారు. మహిళా భద్రత విభాగంలోని నిపుణులు వీరికి సహకరిస్తారు. ఈమేరకు మహిళా భద్రత విభాగం ఐజీ స్వాతిలక్రా అవసరమైన కార్యాచరణ రూపొందించారు.
న్యాయస్థానంలో కేసులు వీగిపోకూడదు...
పొక్సో కేసుల్లో శిక్షల శాతం పెంచడమే లక్ష్యంగా ఈ కసరత్తును ప్రారంభించినట్లు స్వాతిలక్రా తెలిపారు. చిన్నారులపై లైంగిక దాడుల విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తూ ఈ కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. ఎంత సంచలనం సృష్టించిన కేసైనా దర్యాప్తు సరిగ్గా లేకపోతే న్యాయస్థానంలో వీగిపోయే అవకాశముంటుంది. అందుకే దర్యాప్తు అధికారులకు అవసరమైన మెలకువల్ని అందించాలని స్వాతిలక్రా నిర్ణయించారు.