సర్కారు పాఠశాలల విద్యార్థులకు ఆగస్టు 15 నుంచి తరగతులు ప్రారంభించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. కరోనా పరిస్థితుల కారణంగా నాలుగున్నర నెలలుగా రాష్ట్రంలోని సుమారు 40 వేల బడులు మూతపడ్డాయి. ఐతే జూన్ 1 నుంచి పలు కార్పొరేట్, ప్రైవేటు విద్యా సంస్థలు జూమ్, స్కైప్, వేబెక్స్ వంటి యాప్‌లతో ఆన్‌లైన్ తరగతులు మొదలు పెట్టాయి. కానీ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు మాత్రం ఇళ్లకే పరిమితమయ్యారు. ఆగస్టు 31 వరకు విద్యాసంస్థలు తెరవద్దని తాజా మార్గదర్శకాల్లో కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఆగస్టు 15 నుంచి డిజిటల్ పాఠాలు ప్రారంభించాలని విద్యా శాఖ నిర్ణయించింది. అందుకు ప్రభుత్వం సూత్రప్రాయంగా పచ్చ జెండా ఊపినట్టు తెలుస్తోంది.
ఆగస్టు 15 నుంచి పాఠాలు చెప్పేందుకు సర్కారు సమాయత్తం
ప్రభుత్వ పాఠశాలల్లో చదవే విద్యార్థులకు ఆగస్టు 15 నుంచి పాఠాలు మొదలుపెట్టేందుకు రంగం సిద్ధమైంది. టీవీల ద్వారా, వర్క్‌షీట్ల రూపంలో బోధన ప్రారంభించేందుకు రాష్ట్ర విద్యా శాఖ ఏర్పాట్లు చేస్తోంది. డిజిటల్ విద్యపై కేంద్రం రూపొందించిన సూచనలకు అనుగుణంగా మార్గదర్శకాలను సిద్ధం చేసింది..
ఆరు నుంచి పదో తరగతి వరకు దూరదర్శన్ యాదగిరి, టీ-శాట్ విద్యా ఛానెల్ ద్వారా పాఠాలు ప్రసారం చేయనున్నారు. అవసరమైతే స్థానిక కేబుల్ టీవీలను ఉపయోగించాలని భావిస్తున్నారు. ఒకవేళ విద్యార్థుల ఇళ్లల్లో టీవీలు లేకపోతే.. పాఠశాలలు, పంచాయతీ కార్యాలయంలోని టీవీలను ఉపయోగించాలని నిర్ణయించింది. ఇప్పటికే సుమారు 900 డిజిటల్ పాఠాలను విద్యాశాఖ సిద్ధం చేసింది. ఒకటి నుంచి ఐదో తరగతి పిల్లలకు వర్క్ షీట్ల ద్వారా బోధించేలా ప్రణాళికలు చేస్తున్నారు. విద్యార్థుల అనుమానాలను మొబైల్ ఫోన్లు, వాట్సాప్ ద్వారా నివృత్తి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇవీ చూడండి:కరోనాతో మహిళ మృతి.. నిన్నటి నుంచి ఇంట్లోనే మృతదేహాం!