Telangana Letter To jal shakti ministry :కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయమైన, సరిపడా కేటాయింపులు చేసేందుకు వీలుగా తక్షణమే బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్‌కు నివేదించాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఈ మేరకు రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి రజత్ కుమార్ కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శికి లేఖ రాశారు. కొత్త రాష్ట్రానికి కృష్ణా నదీ జలాల్లో కేటాయింపులు చేయాలంటూ 2014 జూన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ఫిర్యాదు సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్నందున తెలంగాణకు న్యాయంగా రావాల్సిన వాటా దక్కడం లేదని లేఖలో పేర్కొన్నారు. సుప్రీంకోర్టులో తెలంగాణ పిటిషన్ ఉపసంహరించుకుంటే ట్రైబ్యునల్‌కు నివేదించే విషయమై నిర్ణయం తీసుకుంటామని 2020 అక్టోబర్ ఆరో తేదీన జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్ణయం తీసుకున్నట్లు లేఖలో గుర్తు చేశారు.
'కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా తేల్చేందుకు నిర్ణయం తీసుకోవాలి' - telangana on krishna river
17:34 April 08
కేంద్ర జలశక్తి శాఖకు రాష్ట్ర ప్రభుత్వం లేఖ
అంతర్ రాష్ట్ర నదీ జలవివాదాల ట్రైబ్యునల్ మూడో సెక్షన్ ప్రకారం కొత్త ట్రైబ్యునల్ ఏర్పాటు చేయాలా... లేక విభజన చట్టం 89వ సెక్షన్ ప్రకారం బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్‌కు నివేదించాలా అన్న విషయమై చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోందని... ఈ విషయంలో సందిగ్ధం అవసరం లేదని రజత్ కుమార్ పేర్కొన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రస్తుతం కృష్ణా నదీ యాజమాన్య బోర్డు 299, 512 టీఎంసీలను తాత్కాలికంగా కేటాయిస్తోందని... 75 శాతం లభ్యత ప్రకారం తెలంగాణకు 574.6 టీఎంసీలు కావాలని కృష్ణా జలవివాదాల రెండో ట్రైబ్యునల్ ముందు వాదిస్తున్నట్లు తెలిపారు. ఈ విషయం తమ పరిధిలో లేదని ట్రైబ్యునల్ తేల్చాలని కేఆర్ఎంబీ కూడా స్పష్టం చేసిందని అన్నారు.
విభజన చట్టం 84వ సెక్షన్ మూడో భాగం ప్రకారం ట్రైబ్యునల్‌కు నివేదించే విషయమై అపెక్స్ కౌన్సిల్ నిర్ణయమే తుదినిర్ణయమని లేఖలో ప్రస్తావించారు. అందుకు భిన్నంగా కేంద్ర ప్రభుత్వం సహా ఎవరూ నిర్ణయం తీసుకోలేరని అన్నారు. ఈ పరిస్థితులన్నింటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రానికి కృష్ణా జలాల్లో కేటాయింపులను తేల్చేందుకు తక్షణమే బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్‌కు నివేదించాలని కోరారు. అపెక్స్ కౌన్సిల్ రెండో సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయమైన, సరిపడా వాటా దక్కేలా కేంద్రం నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి :హస్తినలో ధర్నాకు సిద్ధమవుతున్న గులాబీ దళం.. ఏర్పాట్లు ముమ్మరం..