రాష్ట్రంలో పోడు భూముల సమస్య పరిష్కారానికి సోమవారం నుంచి ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించనుంది. నిర్ణీత షెడ్యూలు ప్రకారం, అటవీహక్కుల చట్టం నాటికి అర్హత కలిగిన గిరిజనుల సమస్యలను వీలైనంత త్వరగా తీర్చేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తోంది. దరఖాస్తుల స్వీకరణ నుంచి గ్రామసభలు, సబ్‌డివిజినల్, జిల్లా కమిటీల ఆమోదానికి చట్టంలోని విధివిధానాలతో మార్గదర్శకాలు రూపొందించింది. ఈ మేరకు గిరిజన సంక్షేమశాఖ జిల్లా కలెక్టర్లు, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారులకు ఆదేశాలు జారీచేసింది.
రాష్ట్రంలో పోడుభూముల సమస్య 2450 గిరిజన గ్రామాల్లో ఉన్నట్లు ప్రభుత్వం అంచనాకు వచ్చింది. అటవీహక్కుల చట్టం(2005) పరిధిలో అర్హులైన గిరిజనుల నుంచి దరఖాస్తులు స్వీకరించనుంది. తొలిరోజు దరఖాస్తుల స్వీకరణతో పాటు గిరిజన గ్రామాలు, గూడేల్లో అటవీ హక్కుల చట్టం, దరఖాస్తు చేసేవిధానం, అర్జీతో సమర్పించాల్సిన పత్రాలపై అవగాహన కల్పించనుంది. ఆవాసాల్లో జనాభా ఎక్కువగా ఉంటే దాన్ని మంగళవారమూ కొనసాగించనుంది. ఈనెల 9, 10 తేదీల్లో దరఖాస్తుల పంపిణీతో పాటు వాటిని పూర్తిచేసేలా అటవీహక్కుల కమిటీలు సహకరిస్తాయి. దరఖాస్తు స్వీకరించేందుకు నాలుగైదు రోజుల సమయం ఇవ్వనుంది. గ్రామస్థాయి కమిటీలు ఈ దరఖాస్తులను పరిశీలించనున్నాయి. ఉపగ్రహ పటాల (శాటిలైట్ మ్యాపుల) సాయంతో లబ్ధిదారులు సాగుచేసిన భూముల వివరాలపై దృష్టి పెడతాయి. ఈ ప్రక్రియ పూర్తికావడానికి సుమారు వారం, పది రోజుల సమయం పట్టొచ్చని గిరిజన సంక్షేమశాఖ భావిస్తోంది.