రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారులు అనూహ్యంగా బదిలీ అయ్యారు. వైద్యారోగ్య శాఖకు చెందిన ఇద్దరు ఉన్నతాధికారులపై బదిలీ వేటుపడింది. కొవిడ్ కేసులు రోజురోజుకూ పెరుగుతుండడం.. కరోనా పరీక్షలు, చికిత్స విషయంలో విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో బదిలీ కావడం చర్చనీయాంశమైంది. వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి... అటవీ శాఖకు బదిలీ అయ్యారు. పర్యావరణ, శాస్త్ర-సాంకేతిక విజ్ఞాన విభాగాలను కూడా సాధారణంగా అటవీ శాఖ కార్యదర్శి వద్దే ఉంటాయి. శాంతి కుమారిని కేవలం అటవీ శాఖకు మాత్రమే పరిమితం చేశారు. మిగతా విభాగాల అదనపు బాధ్యతలను నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రజత్ కుమార్‌కు అప్పగించారు. వైద్య, ఆరోగ్య శాఖ బాధ్యతలను శాంతి కుమారి కంటే 10 బ్యాచ్‌ల జూనియర్ అయిన అధికారికి అప్పగించారు.
ఆరోగ్య శాఖలో కుదుపు..
కేంద్ర సర్వీసు పూర్తి చేసుకొన్న అనంతరం దిల్లీలోని తెలంగాణ భవన్ ఓఎస్డీగా ఉన్న సయ్యద్ అలీ ముర్తజా రిజ్వీని వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శిగా నియమించారు. ఆరోగ్యశ్రీ సీఈవోగాను ఆయనకు అదనపు బాధ్యతలు ఇచ్చారు. ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ యోగితా రాణాను కూడా తప్పించారు. ఎస్సీ అభివృద్ధి శాఖ కమిషనర్‌గా బదిలీ చేశారు. ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌గా గతంలో బాధ్యతలు నిర్వర్తించిన వాకాటి కరుణను తిరిగి ఆ పోస్టులో నియమించారు.
కేంద్ర సర్వీసుల నుంచి తిరిగి వచ్చిన రాణీ కుమిదినిని కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించారు. శిక్షణ కోసం వెళ్లి తిరిగొచ్చిన జ్యోతి బుద్ధ ప్రకాష్‌ను రాష్ట్ర అదనపు ఎన్నికల ప్రధానాధికారిగా నియమించారు. వెయిటింగ్‌లో ఉన్న అదర్ సిన్హాకు ఈపీటీఆర్ఐ డైరెక్టర్ జనరల్‌గా నియమించారు. నాగర్ కర్నూల్ కలెక్టర్‌గా ఎల్. శర్మన్‌ను నియమించిన ప్రభుత్వం... ఆదిలాబాద్ కలెక్టర్ శ్రీదేవసేనను పాఠశాల విద్యా శాఖ సంచాలకులుగా బదిలీ చేసింది. పెద్దపల్లి కలెక్టర్ సిక్తా పట్నాయక్.. ఆదిలాబాద్ కలెక్టర్‌గా బదిలీ అయ్యారు. మంచిర్యాల కలెక్టర్ భారతి హోళీకేరీకి పెద్దపల్లి బాధ్యతలు అదనంగా అప్పగించారు.
ఆ శాఖలకు ప్రత్యేక కార్యదర్శులు..
ఆంధ్రప్రదేశ్ కేడర్ నుంచి డిప్యుటేషన్‌పై వచ్చిన కేఎస్ శ్రీనివాసరాజును పర్యాటక శాఖ కార్యదర్శిగా నియమించారు. వెయిటింగ్ ఉన్న విజయ్ కుమార్‌ను ఎస్సీ అభివృద్ధి శాఖ ప్రత్యేక కార్యదర్శిగా ... ఈ. శ్రీధర్‌ను గిరిజన సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా నియమించారు. ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శిగా రాహుల్ బొజ్జా కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తాజా నియామకాలతో ఎస్సీ అభివృద్ధి, ఎస్టీ సంక్షేమ శాఖలకు కార్యదర్శులతో పాటు ప్రత్యేక కార్యదర్శులు కూడా వచ్చారు. తాజా బదిలీలు, పోస్టింగులు ప్రభుత్వ వర్గాల్లో విస్తృత చర్చనీయాంశంగా మారాయి.
ఇవీచూడండి:గాంధీ ఆస్పత్రిలో సమ్మె విరమించిన పొరుగు సేవల సిబ్బంది