తెలంగాణలో వచ్చే విద్యా సంవత్సరానికి(2021-22) పాఠశాల పాఠ్య పుస్తకాల్లో పూర్తిస్థాయిలో క్యూఆర్ కోడ్ అమలు కానుంది. ఇందుకోసం రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్‌టీ)లో సబ్జెక్టు నిపుణులతో కసరత్తు మొదలైంది. ప్రత్యేకంగా దీనికి ఓ బృందాన్ని నియమించారు. వచ్చే ఏడాదికి సంబంధించి ఫిబ్రవరి నుంచి పుస్తకాల ముద్రణ ప్రారంభమవుతుంది. ఆలోపు ఆ కోడ్‌లను చేరుస్తామని అధికారులు చెబుతున్నారు. ప్రతి అధ్యాయానికి కనీసం ఒక క్యూఆర్ కోడ్‌ను ఉంచాలన్నది లక్ష్యం. ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు అన్ని సబ్జెక్టులు కలిపి 37 పాఠ్యపుస్తకాల్లో ఈ కోడ్‌ను అందుబాటులోకి తీసుకువస్తున్నారు.
2019-20లోనే శ్రీకారం
పాఠ్య పుస్తకాల్లో మొత్తం సమాచారాన్ని ముద్రించలేరు. పెరుగుతున్న పోటీ నేపథ్యంలో పుస్తకంలో ఉన్న సమాచారాన్ని మాత్రమే కాకుండా ఆసక్తి ఉన్నవారు, తెలివైన విద్యార్థులు మరింత లోతుగా, వివరంగా తెలుసుకోవాలనుకునే వారు ఉంటారు. వారిని దృష్టిలో ఉంచుకొని క్యూఆర్ కోడ్‌ను పుస్తకాల్లో ముద్రిస్తున్నారు. సాంకేతికతను పిల్లలు బాగా ఇష్టపడుతున్నారని, అందుకే కాలానుగుణంగా మార్పులు చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు.