తెలంగాణ

telangana

ETV Bharat / city

రాష్ట్రంలో ప్రభుత్వ ఔషధ దుకాణాలు! - Government medical stores

రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో మందుల దుకాణాలను నిర్వహించడంపై వైద్యారోగ్యశాఖ దృష్టి సారించింది. వాటిల్లో కేవలం బ్రాండెడ్‌ జనరిక్‌ ఔషధాలను మాత్రమే అందుబాటులో ఉంచుతారు. తెలంగాణ నుంచే ప్రపంచంలోని దాదాపు 168 దేశాలకు ఔషధాలు ఎగుమతి అవుతున్న నేపథ్యంలో.. ఇక్కడి ప్రజల అవసరాలకు వాటి సేవలను వినియోగించుకోవాలన్నది తాజా ఆలోచన.

Telangana Government medical stores
రాష్ట్రంలో ప్రభుత్వ ఔషధ దుకాణాలు!

By

Published : Oct 30, 2020, 8:50 AM IST

తెలంగాణ సర్కార్ ఆధ్వర్యంలో మందుల దుకాణాలను నిర్వహించడంపై వైద్యారోగ్యశాఖ దృష్టి సారించింది. రాష్ట్రం నుంచే ప్రపంచంలోని దాదాపు 168 దేశాలకు ఔషధాలు ఎగుమతి అవుతున్న నేపథ్యంలో.. ఇక్కడి ప్రజల అవసరాలకు వాటి సేవలను వినియోగించుకోవాలన్నది తాజా ఆలోచన. ఇటీవల వైద్యఆరోగ్యశాఖపై నిర్వహించిన మంత్రివర్గ ఉపసంఘం భేటీలో ఈ అంశం ప్రధానంగా చర్చకు వచ్చినట్లు తెలిసింది.

ఇందుకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తే.. రాష్ట్రంలోని ఔషధ ఉత్పత్తి సంస్థలతో ప్రత్యేకంగా ఒక సమావేశాన్ని నిర్వహించేందుకు చొరవ తీసుకుంటామని మంత్రి వర్గ ఉపసంఘం మార్గనిర్దేశం చేసినట్లుగా సమాచారం. దీంతో ఉన్నతాధికారులు కార్యాచరణ ప్రణాళికపై కసరత్తు చేస్తున్నారు.

కార్యాచరణ ఇలా..

* రాష్ట్రంలో సుమారు 800కి పైగా ఫార్మా సంస్థలుండగా.. ఇందులో అంతర్జాతీయంగా ప్రఖ్యాతిగాంచిన సంస్థలు కూడా అధికంగానే ఉన్నాయి. వీటి ద్వారా ఏటా సుమారు రూ. 50వేల కోట్ల విలువైన లావాదేవీలు కొనసాగుతున్నట్లు అంచనా.

* ఈ సంస్థల ప్రతినిధులతో నేరుగా ఆరోగ్య, పరిశ్రమ శాఖల ఉన్నతాధికారులు సమావేశమై ప్రత్యేకంగా బ్రాండెడ్‌ జనరిక్‌ ఔషధాలను ప్రభుత్వ ఔషధ దుకాణాల కోసం ఉత్పత్తి చేయాల్సిందిగా కోరాలని, ఆ మేరకు ఒప్పందం చేసుకోవాలని యోచిస్తున్నారు.

* ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వైద్యసేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ(టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ) ద్వారా సర్కారు దవాఖానాలకు ఏటా సుమారు రూ.300 కోట్ల విలువైన.. సుమారు 600 రకాల వేర్వేరు మందులను కొంటున్నారు. ప్రతిపాదిత విధానం ద్వారా ‘బ్రాండెడ్‌ జనరిక్‌’ ఔషధాలను ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరఫరా చేయాలనేది యోచన.

* దాని ప్రకారం ప్రస్తుతం సర్కారు దవాఖానాల్లోని ప్రైవేటు మెడికల్‌ షాపులను తొలగిస్తారు.

* ఆసుపత్రుల వద్దే కాకుండా రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో విరివిగా సర్కారు మందుల దుకాణాలను నెలకొల్పుతారు.

ఏమిటీ బ్రాండెడ్‌ జనరిక్‌?

* ప్రస్తుతం ఔషధాలు మూడు రకాలుగా లభ్యమవుతున్నాయి. 1. బ్రాండెడ్‌ 2. జనరిక్‌ 3.బ్రాండెడ్‌ జనరిక్‌.

* ఉత్పత్తి సంస్థ ఒక పేరుతో ఔషధాన్ని విపణిలోకి తీసుకొచ్చి, దాన్ని వైద్యులకు వివరించి, వారి ద్వారా రోగులతో వాడించే కేటగిరీలోకి వచ్చేవి బ్రాండెడ్‌. వీటికి ఎక్కువగా ప్రచారం ఉంటుంది.

* కేవలం మందులోని మూలగుణం(జనరిక్‌ నేమ్‌) పేరుతో మాత్రమే ఉత్పత్తి చేసేది జనరిక్‌. వీటిని ఉత్పత్తి చేసే సంస్థలు ప్రచారం చేసుకోవు కాబట్టి వీటి గురించి ప్రజలకు ఎక్కువగా తెలియదు.

* మూలగుణానికి మరో కొత్తపేరును చేర్చుతూ లేదా తమ సంస్థ పేరునే ప్రముఖంగా ముద్రిస్తూ తయారుచేసేది బ్రాండెడ్‌ జనరిక్‌. వీటిని ఎక్కువగా ప్రముఖ ఫార్మా సంస్థలు ఉత్పత్తి చేస్తుంటాయి.

ABOUT THE AUTHOR

...view details