పురపాలక ఎన్నికల కోసం వార్డుల వారీ ఓటర్ల జాబితా తయారీ కొనసాగుతోంది. అది పూర్తయితే కీలకమైన రిజర్వేషన్ల ప్రక్రియ చేపట్టనున్నారు. ఏ పదవి ఎవరికి కేటాయిస్తారోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ఎన్నికల నిర్వహణలో కీలకమైన రిజర్వేషన్ల ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేయాల్సి ఉంది. రిజర్వేషన్ల ప్రక్రియ కోసం గతంలోనే రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల వివరాలు రెండు దఫాలుగా సేకరించారు. రిజర్వేషన్ల ఖరారు కోసం పురపాలకశాఖ మార్గదర్శకాలు ప్రకటించింది.
రెండు యూనిట్లుగా విభజన...
కొత్త చట్టం ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఖరారు చేస్తారు. ఇవి కాకుండా 50 శాతానికి మించకుండా బీసీ రిజర్వేషన్లు ఖరారు చేస్తారు. కొత్త చట్టం ప్రకారం రాష్ట్రంలో ప్రస్తుతం 13 కార్పొరేషన్లు, 128 మున్సిపాల్టీలు ఉన్నాయి. 13 కార్పొరేషన్లు ఒక యూనిట్‌గా మేయర్ పదవులకు రిజర్వేషన్ ఖరారు చేస్తారు. 2011 జనాభా లెక్కల ప్రకారం 13 కార్పొరేషన్లలోని మేయర్ పదవులను ఎస్సీ, ఎస్టీల శాతానికి అనుగుణంగా కేటాయిస్తారు. ఈ రెండు కేటగిరీలకు కనీస ప్రాతినిధ్యం తప్పనిసరిగా ఉండాల్సిందే. యాభై శాతంలో మిగతా శాతం సీట్లను బీసీలకు రిజర్వ్ చేస్తారు.