Rabi Paddy Procurement : యాసంగి ధాన్యం కొనుగోళ్ల వ్యవహారాన్ని గట్టెక్కించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎగుమతిదారులు, మిల్లర్లతో మంతనాలు సాగిస్తోంది. రైతులు అవస్థలు పడకుండా తనవంతు ప్రయత్నాలు చేస్తోంది. యాసంగి వడ్లను సాధారణ బియ్యంగా మార్చేందుకు ఉన్న అవకాశాలనూ పరిశీలిస్తోంది. మార్చి నెలతో ముగిసిన ప్రస్తుత యాసంగిలో 35.84 లక్షల ఎకరాల్లో వరిసాగు చేసినట్లు వ్యవసాయశాఖ నిర్ధారించింది. సుమారు 70 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా. సుమారు 47 లక్షల టన్నుల వరకు బియ్యం వస్తాయి. తేమ శాతం తగ్గిపోవటంతో సాధారణ బియ్యంగా మారిస్తే నూకలు ఎక్కువగా వచ్చి నష్టపోతామని మిల్లర్లు చెబుతున్నారు. ధాన్యాన్ని మరోదఫా ప్రయోగాత్మకంగా మిల్లింగ్ చేయిస్తే స్పష్టత వస్తుందన్న ఆలోచన అధికార వర్గాల్లో ఉంది. 2015లో ఒకదఫా రాష్ట్ర ప్రభుత్వం వివిధ ప్రాంతాల్లో టెస్ట్ మిల్లింగ్ చేయిస్తే క్వింటా వడ్లకు సగటున 66 శాతం వరకు బియ్యం వచ్చాయి. అందులో 20 నుంచి 25 శాతం నూకలున్నాయి. అప్పట్లో చెరువులు, బోర్ల కింద రైతులు వ్యవసాయం చేసేవారు. ప్రస్తుతం నీరు పుష్కలంగా ఉన్నందున మరోసారి టెస్ట్ మిల్లింగ్ చేస్తే బియ్యం 66 శాతం కన్నా ఎక్కువగానే వస్తాయన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
భారీగా కొనేవారి గురించి ఆరా :తెలుగు రాష్ట్రాల్లో ధాన్యం భారీగా కొనగలిగే వారి గురించి ప్రభుత్వం ఆరా తీస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోనే ఎగుమతిదారులున్నందున.. తెలంగాణ నుంచి ధాన్యం కొనే అవకాశాలపై వారితో మంతనాలు సాగించింది. అయితే, కనీస మద్దతు ధరకు తీసుకునేందుకు వారంతగా ఆసక్తి చూపటం లేదని తెలుస్తోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో పోటీతో పాటు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఎగుమతులకు రవాణా ఛార్జీలు గణనీయంగా పెరగటంతో గిట్టుబాటు కాదని వారు స్పష్టం చేసినట్లు సమాచారం.