Sabitha indra reddy On Koti women's College: త్వరలో వందేళ్లు పూర్తి చేసుకోబోతున్న హైదరాబాద్ కోఠి మహిళా కళాశాలను రాష్ట్రంలో తొలి మహిళా విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. కోఠి మహిళా కళాశాలను విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్దే అంశంపై తన కార్యాలయంలో విద్యా శాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్షించారు. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, ఉపాధ్యక్షుడు వెంకటరమణ, సాంకేతిక విద్యా కమిషనర్ నవీన్ మిట్టల్, ఇంటర్మీడియట్ విద్యా కమిషనర్ ఉమర్ జలీల్, ఉస్మానియా విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ లక్ష్మీనారాయణ, కోఠి మహిళా కళాశాల ప్రిన్సిపల్ విజులత తదితరులు పాల్గొన్నారు.
ఉస్మానియా విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉండి యూజీసీ స్వయం ప్రతిపత్తి, న్యాక్ గుర్తింపు కలిగిన కోఠి కళాశాలను మహిళా విశ్వవిద్యాలయంగా మార్చేందుకు అన్ని అర్హతలు కలిగి ఉందని ప్రభుత్వం భావించిందని మంత్రి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు మహిళా విశ్వవిద్యాలయం ఏర్పాటును వేగవంతం చేసే దిశగా పనులు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. కోఠి మహిళా కళాశాలను విశ్వవిద్యాలయంగా మార్చితే అవసరమయ్యే బోధనా సౌకర్యాలు, విద్యార్థుల వసతులు, మౌలిక సదుపాయాలు తదితర అంశాలపై కూలంకుశంగా పరిశోధించి ఒక నివేదిక రూపొందించాలని సూచించారు. మహిళా విశ్వవిద్యాలయం ఏర్పాటకు విధి విధానాలు, అనుమతుల గురించి వివరాలు అందించాలని... ఆ దిశగా చర్యలు చేపట్టేందుకు విద్యా శాఖలో అంతర్గతంగా కమిటీ వేసుకోవాలని చెప్పారు.