రాష్ట్రంలో వ్యాక్సినేషన్ పునఃప్రారంభమైన తర్వాత కేవలం రెండో డోసు వారికే టీకా వేస్తున్నారు. తొలిడోసును మొదటగా సూపర్ స్ప్రెడర్లకు ఇవ్వాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో వైద్యారోగ్యశాఖ కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా నిత్యం వందలమందిని కలిసే పౌర సరఫరాల శాఖ సిబ్బంది, క్యాబ్ డ్రైవర్లు, ఫర్టిలైజర్ దుకాణదారులు, వీధి వ్యాపారులు, జర్నలిస్టులు, ఇతర దుకాణాల్లో పనిచేసే వారిని సూపర్ స్ప్రెడర్ కేటగిరీలో చేర్చారు. ఆయా విభాగాల్లో కలిపి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 7లక్షల 75 వేల మంది ఉన్నట్టు ప్రకటించింది. ప్రస్తుతం ఆరోగ్యశాఖ వద్ద 6.18 లక్షల కొవిషీల్డ్, 3.35లక్షల కొవాగ్జిన్ డోసులు అందుబాటులో ఉండగా... కొవాగ్జిన్ మొదటి డోసు తీసుకున్న 3 లక్షల మందికి ఈ నెలాఖరు నాటికి రెండో డోసు ఇవ్వాల్సి ఉంది. జూన్ మొదటి వారంలో మరిన్ని వ్యాక్సిన్ డోసులు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉండటంతో ఈనెల 28 నుంచి సూపర్ స్ప్రెడర్‌లకు వ్యాక్సినేషన్ నిర్వహించనున్నట్టు ఆరోగ్యశాఖ ప్రకటించింది.
28 నుంచి 30 లోపు..
సూపర్ స్ప్రెడర్లలో మొదటి గ్రూపుగా భావిస్తున్న పౌరసరఫరాలశాఖలో మొత్తం 85,031మందికి వ్యాక్సినేషన్ ఇవ్వనున్నట్టు ఆరోగ్యశాఖ తెలిపింది. ఇందులో రేషన్ దుకాణాదారులు 33,980మంది... ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్లు, సిబ్బంది కలిపి 49,616మంది, ఎఫ్సీఐ సిబ్బంది 1,435 మంది ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఫర్టిలైజర్, పెస్టిసైడ్ దుకాణాల్లో పనిచేస్తున్న 30వేల మందికి, 20వేల మంది జర్నలిస్టులకు ఈనెల 28 నుంచి 30 లోపు వ్యాక్సినేషన్ పూర్తి చేయనున్నారు.