గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మౌలిక సదుపాయాలు, గృహ నిర్మాణానికి ప్రభుత్వం పెద్దపీట వేసింది. అత్యధికంగా ఈ రంగాలపైనే నిధులు ఖర్చుచేసింది. 2014-15వ ఆర్థిక సంవత్సరం నుంచి ఈ ఏడాది ఆగస్టు వరకు పూర్తిచేసిన, ప్రస్తుతం అమలులో ఉన్న పనులను పరిగణనలోకి తీసుకుంటే గ్రేటర్ హైదరాబాద్ నగరపాలక సంస్థ, మెట్రో వాటర్ వర్క్స్, మెట్రోరైలు, రోడ్లు,భవనాలు, చెరువులు, సరస్సుల వంటి నీటివనరుల అభివృద్ధి..ఇలా అన్ని విభాగాల్లో కలిపి రూ.67,149.23 కోట్లు వెచ్చించింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ ఏర్పడిన తర్వాత హైదరాబాద్ పరిధిలో చేసిన ఖర్చుపై ఈ మేరకు ప్రభుత్వం ఓ నివేదిక రూపొందించింది. దేశంలో అత్యంత వేగంగా విస్తరిస్తున్న నగరాల జాబితాలో హైదరాబాద్ ఉన్నందున, ఇక్కడ మౌలిక సదుపాయాలను పరిరక్షించడంతోపాటు, కొత్త వసతుల కల్పనకు అనేక పనులు చేపట్టినట్లు ఈ నివేదికలో వెల్లడించింది. సదరు నివేదికను శుక్రవారం పురపాలిక శాఖ మంత్రి కేటీఆర్ విడుదల చేశారు.
నిర్మాణంలో 98 వేల రెండు పడక గదుల ఇళ్లు
రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం 109 చోట్ల ప్రారంభమైంది. 98 వేల ఇళ్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. వీటికోసం ఇప్పటికే రూ.6,113.88 కోట్లు ఖర్చుచేశాం. మరో రూ.3,586.12 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంది. మొత్తంగా గృహ నిర్మాణానికే రూ.9,700 కోట్లు వెచ్చించాం.
జీహెచ్‌ఎంసీ పరిధిలో ఐదేళ్లలో రూ.67,149 కోట్ల వ్యయం
వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఒకటైన హైదరాబాద్ మహానగర ప్రగతికి నిధుల కేటాయింపులో ప్రాధాన్యం ఇచ్చినట్టు తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. ముఖ్యంగా రవాణా సౌకర్యాల్లో కీలకమైన రహదారుల అభివృద్ధి, ఫ్లైఓవర్లు, లింకురోడ్ల నిర్మాణం, కూడళ్ల సుందరీకరణకు ఐదేళ్ల వ్యవధిలో అధిక నిధులు వెచ్చించినట్టు వెల్లడించింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో స్వచ్ఛత పెంపుదల సహా మొక్కల పెంపకం, ఉద్యానవనాల అభివృద్ధి, పర్యాటక రంగం, వారసత్వ భవనాల పరిరక్షణకు ఎనలేని కృషిచేసినట్టు తెలిపింది. పోలీసు వ్యవస్థను మెరుగుపరడం వల్ల ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు రక్షణ పెరిగిందని, ఇది మహానగర బ్రాండ్ విలువ పెంచిందని చెప్పింది. ఫలితంగా ఐదేళ్లలో రెండు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రాబట్టగలిగామని శుక్రవారం హైదరాబాద్ ప్రగతిపై విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. మొత్తంగా జీహెచ్‌ఎంసీ పరిధిలోని వివిధ విభాగాల్లో ఖర్చయిన నిధులు, తద్వారా ఒనగూరిన ప్రయోజనాలను ఈ నివేదికలో పొందుపరిచింది.
నివేదికలోని ముఖ్యాంశాలివీ
*వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధి ప్రణాళిక కింద రూ.24 వేల కోట్ల పెట్టుబడితో 137 కి.మీ పొడవున ఏడు ఆకాశ మార్గాలు, 166 కి.మీ పొడవున కారిడార్ల నిర్మాణం చేపట్టాం. ఇందులో అనేక పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. దీనివల్ల అత్యంత రద్దీగా ఉండే కూకట్‌పల్లి, ఎల్‌బీ నగర్, అయ్యప్ప సొసైటీ తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ తగ్గింది. ఇందిరా పార్క్, ఒవైసీ జంక్షన్ తదితర ప్రాంతాల్లో ఉక్కు వంతెనల నిర్మాణం ప్రారంభ దశలో ఉంది.
*ఎస్‌ఆర్‌డీపీ కింద 46 ప్లైఓవర్ల నిర్మాణం చేపట్టడంతోపాటు 27 లింకు రోడ్ల నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టాం. సమగ్ర రోడ్డు మరమ్మతు పథకం(సీఆర్‌ఎంపీ) కింద 709 కి.మీ రోడ్ల నిర్మాణాన్ని ఏడు ప్యాకేజీలుగా చేపట్టి, వాటి పూర్తికి లాక్‌డౌన్ కాలాన్ని సద్వినియోగం చేసుకున్నాం. వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధి ప్రణాళిక కింద ఫ్లైఓవర్లు, ఆర్‌ఓబీలు, కూడళ్ల సుందరీకరణ ఇలా అన్నింటికీ కలిపి చేసిన ఖర్చు, నిర్మాణంలో ఉన్న పనుల విలువ రూ.8,410 కోట్లు.
*నగరంలో వెయ్యి బస్ షెల్టర్ల నిర్మాణం పూర్తయింది. మరో 800 నిర్మాణంలో ఉన్నాయి.
*క్రీడాసదుపాయాలు, ఆడిటోరియం, ఇండోర్ స్టేడియాలు, ఆట స్థలాల నిర్మాణానికి మరో రూ.97.37 కోట్లు ఖర్చు చేశాం.