ప్రభుత్వమే తల్లిదండ్రిగా మారి అనాథల సంరక్షణ, సంక్షేమం, భవిష్యత్ బాధ్యతలు తీసుకునేలా... దేశంలోనే అత్యుత్తమ, ఆదర్శవంతమైన విధానాన్ని రూపొందించాలని మంత్రివర్గ ఉపసంఘం అభిప్రాయపడింది. అనాథలు, అనాథాశ్రమాలు, కొవిడ్ వల్ల అనాథలైన చిన్నారుల స్థితిగతులపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం తొలిసమావేశం నేడు జరిగింది. మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఉపసంఘంలోని మంత్రులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
అనాథల సంక్షేమాన్ని మానవీయ కోణంలో ప్రభుత్వం చూస్తుందని, ఎంత ఖర్చునైనా భరిస్తుందని ఉపసంఘం తెలిపింది. దేశం మొత్తం గర్వించేలా.. ఇతర రాష్ట్రాలలన్నీ అనుసరించేలా కొత్త విధానాన్ని రూపొందించాలని అభిప్రాయపడింది. అనాథగా ప్రభుత్వ సంరక్షణలోకి వచ్చిన పిల్లలు ఎదిగి, స్థిరపడి కుటుంబంగా తయారయ్యే వరకు ప్రభుత్వమే వారికి తల్లిదండ్రులుగా బాధ్యతలు తీసుకునేలా... కొత్త విధానాన్ని తీసుకొచ్చేందుకు ప్రతిపాదనలు రూపొందిస్తామని మంత్రులు తెలిపారు.