తెలంగాణ

telangana

ETV Bharat / city

GOVERNMENT LANDS: మలి విడత భూముల అమ్మకంపై రాష్ట్ర సర్కారు దృష్టి - telangana varthalu

పన్నేతర రాబడిని పెంచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పన్నేతర రాబడిగా రూ.30 వేలకోట్లను సమీకరించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించగా... భూముల విక్రయం ద్వారానే కనీసం రూ.16 వేల కోట్ల రాబడిని అంచనా వేసింది. ఈ నేపథ్యంలోనే మలి విడత భూముల వేలంపై ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది.

GOVERNMENT LANDS: మలి విడత భూముల అమ్మకంపై రాష్ట్ర సర్కారు దృష్టి
GOVERNMENT LANDS: మలి విడత భూముల అమ్మకంపై రాష్ట్ర సర్కారు దృష్టి

By

Published : Jul 23, 2021, 7:16 AM IST

పన్నుల రాబడితోపాటు పన్నేతర రాబడిని పెంచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పన్నేతర రాబడిగా రూ.30 వేలకోట్లను సమీకరించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించగా భూముల విక్రయం ద్వారానే కనీసం రూ.16 వేల కోట్ల రాబడిని అంచనా వేసింది. మొదటి విడత భూముల వేలం ద్వారా ప్రభుత్వానికి రూ.3,000 కోట్లు సమకూరుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మలి విడత భూముల వేలంపై ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది. భూముల విలువలు, రిజిస్ట్రేషన్‌ ఛార్జీలను పెంచిన ప్రభుత్వం రిజిస్ట్రేషన్‌ శాఖ ద్వారా అదనపు ఆదాయంగా రూ.3,500 కోట్ల నుంచి రూ.4,000 కోట్లను ఆశిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రిజిస్ట్రేషన్‌ శాఖ ద్వారా రూ.12,500 కోట్ల ఆదాయాన్ని అంచనా వేయగా ఇప్పటి వరకూ రూ.2,200 కోట్లు వచ్చింది. కొవిడ్‌ పరిస్థితులతో రిజిస్ట్రేషన్ల రాబడి తగ్గినా మిగిలిన ఆరు నెలల్లో గణనీయంగా పెరుగుతుందని రిజిస్ట్రేషన్ల శాఖ భావిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పన్నులు, పన్నేతర రాబడిని రూ.1.23 లక్షల కోట్లుగా ప్రభుత్వం అంచనా వేసింది. కొవిడ్‌ విజృంభణ నేపథ్యంలో మే నెల రాబడులపై కొంత మేర ప్రభావం పడినా ఏప్రిల్‌, జూన్‌, జులై నెలల రాబడులు అంచనాలకు చేరువగా ఉన్నాయి.

ఆశాజనకంగానే జీఎస్టీ రాబడులు

జీఎస్టీ, అమ్మకం పన్ను ఒక నెల మినహా మిగిలిన అన్ని నెలలు అంచనాల మేరకే ఉంది. పెట్రోలు, మద్యం అమ్మకం పన్నుతో పాటు జీఎస్టీ రాబడి నెలకు సగటున రూ.4,500 కోట్లకుపైగా వస్తోంది. ఈ నెలలో జీఎస్టీ పరిహారంగా రాష్ట్రానికి రూ.2,155 కోట్లు అందింది.
* ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వాణిజ్య పన్నుల శాఖ ద్వారా రూ.52,500 కోట్ల రాబడిని ప్రభుత్వం అంచనా వేసింది. ఇప్పటి వరకూ రాష్ట్రానికి ఈ శాఖ ద్వారా రూ.16,100 కోట్ల రాబడి వచ్చింది.
* మద్యం అమ్మకాలతో ఎక్సైజ్‌ శాఖ ద్వారా రూ.17,000 కోట్ల రాబడికి గాను జులై మూడో వారానికి రూ.4 వేల కోట్లకు పైగా రాబడి వచ్చింది.
* గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌లు, కేంద్ర పన్నుల వాటా ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.47 వేల కోట్లు వస్తుందని అంచనా వేయగా 3వేల కోట్ల రూపాయల లోపే వచ్చింది.
* బడ్జెట్‌ పరిధిలో బాండ్ల విక్రయం ద్వారా ఈ సంవత్సరం రూ.47,500 కోట్లను సమీకరించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించగా ఇప్పటి వరకూ రూ.14,500 కోట్ల రుణాన్ని పొందింది.
* ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర గ్రాంట్లు, కేంద్ర పన్నుల వాటా మినహా మిగిలిన అంశాల్లో రాబడులు అంచనాలమేరకున్నాయని ఆర్థికశాఖ అధికారులు స్పష్టం చేశారు.

తొలిరోజు 4,844 రిజిస్ట్రేషన్లు

రాష్ట్రంలో పెరిగిన భూముల మార్కెట్‌ విలువలు, కొత్త రిజిస్ట్రేషన్‌ ఛార్జీలతో గురువారం 4,844 రిజిస్ట్రేషన్లు జరిగాయి. వీటి ద్వారా రూ.29 కోట్ల రాబడి వచ్చింది. హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల పరిధిలోనే ఎక్కువ రిజిస్ట్రేషన్లు జరిగాయి. పెరిగిన మార్కెట్‌ విలువలు, 7.5 శాతం రిజిస్ట్రేషన్‌ ఛార్జీల మేరకు సాఫ్ట్‌వేర్‌ను బుధవారం రాత్రే అనుసంధానం చేయడంతో గురువారం సమస్యలు లేకుండా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగింది.

ఎల్‌ఆర్‌ఎస్‌ ద్వారా రాబడికి అవకాశం

రాష్ట్ర వ్యాప్తంగా అనధికార లేఅవుట్‌ల క్రమబద్ధీకరణ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించింది. రాష్ట్ర వ్యాప్తంగా 25.5 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఎల్‌ఆర్‌ఎస్‌, బీఆర్‌ఎస్‌ రెండూ సుప్రీంకోర్టులో విచారణలో ఉన్నాయి. అక్కడ స్పష్టత వస్తే దరఖాస్తుల పరిష్కారంతో భారీగా ఆదాయం సమకూరే అవకాశం ఉంది.

ఇదీ చదవండి:దళిత బంధుపై సదస్సు.. హుజూరాబాద్‌ వాసులకు సీఎం ఆహ్వానం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details