Kharif cultivation in Telangana: ప్రస్తుత యాసంగిలో వరి ధాన్యం కొనుగోలుపై అనిశ్చితి నెలకొన్న తరుణంలో మరో రెండు నెలల్లో ప్రారంభం కానున్న వానాకాలం పంటలసాగుపై ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. సన్నబియ్యానికి మార్కెట్‌లో డిమాండు అధికంగా ఉన్నందున మద్దతు ధర సులభంగా వస్తుందని మార్కెటింగ్‌శాఖ అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలోనే సన్నవరి సాగుపై ప్రభుత్వం ఎలాంటి ఆంక్షలను విధించడం లేదని సమాచారం. వరి విత్తనాల ధరపై రాయితీని ఇచ్చే అవకాశాలు లేవని తెలిసింది. వచ్చే వానాకాలంలో పత్తి, కంది పంట అధికంగా వేయాలని రైతులకు ప్రభుత్వం సూచిస్తోంది.
మార్కెట్ ధరలకే విత్తనాలు...: వడ్ల కొనుగోలులో కేంద్రం కొర్రీలతో ప్రత్యామ్నాయాలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించింది. పత్తి, కంది సాగును మరింత ప్రోత్సహించాలని వ్యవసాయశాఖ నిర్ణయించింది. ఈ రెండు పంటలకు జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో మంచి డిమాండు ఉన్నందున వీటి సాగు విస్తీర్ణం పెంచేందుకు రైతులను ప్రోత్సహించనున్నారు. గత వానాకాలంలో రాష్ట్రంలో 46 లక్షల ఎకరాల్లో పత్తి, 7 లక్షల ఎకరాల్లో కంది, 62 లక్షల ఎకరాల్లో వరి పంటను రైతులు సాగుచేశారు. వచ్చే వానాకాలంలో పత్తి 60 లక్షల ఎకరాలకు పైగా వేస్తారని వ్యవసాయశాఖ అంచనా. అంతర్జాతీయ మార్కెట్‌లో డిమాండ్ ఉన్నందున పత్తి పంట సాగును ప్రోత్సహించనున్నారు. ఎకరానికి 2 పత్తి విత్తన ప్యాకెట్లు అవసరం. 60 లక్షల ఎకరాలకు సరిపోయేలా కోటి 20 లక్షల విత్తన ప్యాకెట్లను గ్రామాలకు పంపాలని ప్రైవేటు విత్తన కంపెనీలు నిర్ణయించాయి. రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ వద్ద ఉన్న వరి విత్తనాలను మార్కెట్ ధరలకే రైతులకు విక్రయించనున్నట్లు విశ్వసనీయ సమాచారం.