రాష్ట్రంలోని పాఠశాలలు, గురుకులాల్లో కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో 6, 7, 8 తరగతుల వరకైనా ప్రత్యక్ష తరగతులను నిలిపివేయాలని ప్రభుత్వం భావిస్తోంది. పాఠశాలలను కొనసాగించాలా? లేదా? అనే అంశంపై రెండు మూడు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం అసెంబ్లీలో ప్రకటించారు.
ఈ నేపథ్యంలోనే ఉన్నతాధికారులు బుధవారం సాయంత్రం తరగతులు, జిల్లాలవారీగా విద్యార్థుల సంఖ్య, ఇప్పటివరకు కరోనా బారిన పడిన విద్యార్థులు, ఉపాధ్యాయుల సంఖ్య, మూతపడిన బడుల వివరాలను అధికారుల నుంచి హడావుడిగా తెప్పించుకున్నారు. మొత్తం 200 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇప్పటి వరకు కరోనా పాజిటివ్ బారినపడ్డారని ప్రభుత్వానికి నివేదించారు. ఇంకా కేసులు పెరిగే అవకాశం ఉండటం, వారి ద్వారా కుటుంబ సభ్యులు కూడా కరోనా బారిన పడతారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో కనీసం 6, 7, 8 తరగతులను అయినా నిలిపివేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా ఆ మూడు తరగతుల్లో 14.34 లక్షల మంది విద్యార్థులున్నారు.