తెలంగాణ

telangana

ETV Bharat / city

ఎస్సీ సాధికారతపై సర్కార్​ నజర్​.. నేడు సీఎం అఖిలపక్ష భేటీ - సీఎం అఖిలపక్ష భేటీ

ఎనిమిది లక్షల మంది నిరుపేద ఎస్సీ కుటుంబాలను దశల వారీగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా దళిత సాధికారత పథకాన్ని అమలు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్​ స్పష్టం చేశారు. ఇందుకోసం ఈ ఏడాది వెయ్యి కోట్లు ఖర్చు చేస్తామని వెల్లడించారు. ఏటా లాటరీ విధానంలో కొంతమంది లబ్ధిదారులను ఎంపికచేసి... రైతుబంధు, ఫించన్ల తరహాలో బ్యాంకు ఖాతాల్లో నగదు చేస్తామన్నారు. పథకం విధివిధానాల కోసం ఎస్సీ ప్రజాప్రతినిధులు, నేతలతో సీఎం కేసీఆర్​ ఇవాళ అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నారు.

telangana government looks at SC empowerment
telangana government looks at SC empowerment

By

Published : Jun 27, 2021, 4:28 AM IST


దళిత సాధికారత పథకం అమలు దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. బడ్జెట్లో వెయ్యి కోట్లు కేటాయించిన సర్కారు... విధివిధానాల ఖరారుకు సిద్ధమైంది. ఇందుకు సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్​... ఇవాళ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ప్రగతిభవన్ వేదికగా జరిగే సమావేశంలో.... రాష్ట్రంలోని ఎస్సీ ప్రజాప్రతినిధులతో పాటు మజ్లిస్, భాజపా, సీపీఎం(CPM), సీపీఐ(CPI) పార్టీల నేతలను కేసీఆర్‌ ఆహ్వానించారు. సీనియర్ ఎస్సీ నేతలు కడియం శ్రీహరి, మందా జగన్నాథం, మోత్కుపల్లి నర్సింహులు, ఆరేపల్లి మోహన్, గడ్డం ప్రసాద్ కుమార్‌లు సమావేశానికి హాజరు కావాలని కోరారు. ఎస్సీల సంక్షేమం, అభివృద్ధి కోసం పార్టీలకతీతంగా క్షుణ్ణంగా చర్చించి.... వారి అభిప్రాయలు తీసుకొని.... విధివిధానాలు ఖరారు చేయాలని సీఎం భావిస్తున్నారు.

ఎస్సీల వివక్షతపై సీఎం ఆవేదన...

కలెక్టర్లు, అధికారులతో శనివారం నిర్వహించిన సమావేశంలోనూ.. దళిత సాధికారత పథకంపై ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఆలోచనలు వివరించారు. శరీరంలోని ఓ భాగం పాడైతే ఆ శరీరానికి ఎంత బాధ ఉంటుందో.. సమాజంలో ఓ భాగం వివక్షకు గురైతే కూడా అంతే బాధగా ఉంటుందని సీఎం అన్నారు. మనలోనే భాగమై జీవిస్తున్న మనుషులను ఎస్సీల పేరుతో బాధపెట్టే వ్యవహారం మంచిది కాదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడి ఉన్న ఎస్సీల అభివృద్ధిని... సమాజంలోని ప్రతి ఒక్కరు బాధ్యతగా భావించిన రోజే ఎస్సీల సాధికారత సాధ్యం అవుతుందని స్పష్టం చేశారు. అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోందన్న సీఎం... ఇవాళ నిర్వహించే సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు.

ఎస్సీల సాధికారత కోసం వెయ్యి కోట్లు..

పథకంలో భాగంగా దాదాపు అర్హులైన 8 లక్షల ఎస్సీ నిరుపేద కుటుంబాలను దశలవారీగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా కార్యక్రమాలు నిర్వహిస్తామని కేసీఆర్‌ తెలిపారు. ఈ ఏడాది దళిత సాధికారత పథకం కోసం వెయ్యి కోట్లు ఖర్చు చేయనున్నామని ప్రకటించారు. దళిత సాధికారత పథకానికి... ఎస్సీ ప్రత్యేక అభివృద్ధి నిధికి సంబంధం లేదన్నారు. ప్రతి ఏటా కొంతమంది లబ్దిదారులను లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక చేసి... రైతుబంధు, ఫించన్ల తరహాలోనే వారి బ్యాంకు ఖాతాల్లో నేరుగా డబ్బు జమయ్యేలా చేస్తామని సీఎం తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి....కలెక్టర్లు, ఉన్నతాధికారులు... పారదర్శకంగా అర్హులను ఎంపిక చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.

ముఖ్యమంత్రి నేతృత్వంలో ఇవాళ జరగనున్న అఖిలపక్ష సమావేశాన్ని భాజపా బహిష్కరించింది. తెరాస ప్రభుత్వానికి దళితులపై మాట్లాడే నైతిక అర్హత లేదని భాజపా రాష్ట్ర కార్యదర్శి బంగారు శృతి విమర్శించారు. ఎస్సీలు దూరమవుతున్నారని భావించి.. సమావేశం నిర్వహిస్తున్నారు తప్పా... వారిపై ప్రేమ లేదని ఆరోపించారు. అందువల్లే సమావేశానికి హాజరుకాబోమని స్పష్టంచేశారు.

ఇదీ చూడండి:TPCC: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియామకం

ABOUT THE AUTHOR

...view details