పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణాజలాలను తరలించకుండా తక్షణమే నిలువరించాలని కృష్ణానదీ యాజమాన్య బోర్డును తెలంగాణ ప్రభుత్వం మరోమారు కోరింది. ఈ మేరకు నీటిపారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ కేఆర్ఎంబీ ఛైర్మన్ ఎంపీ సింగ్‌కు లేఖ రాశారు. పోతిరెడ్డిపాడు ద్వారా ఏపీ కృష్ణా బేసిన్ వెలుపలకు అక్రమంగా నీటిని తరలిస్తోందని గతంలోనే పలుమార్లు ఫిర్యాదు చేశామన్న ఆయన... గడచిన రెండేళ్లలో 179, 129 టీఎంసీల నీటిని తరలించిందని లేఖలో పేర్కొన్నారు. ఈ ఏడాది 10.48 టీఎంసీలకు గాను ఇవాళ్టికే 25 టీఎంసీలు తరలించిందని తెలిపారు.
పోతిరెడ్డిపాడు నుంచి ఏపీ నీరు తరలించకుండా ఆపాలి: తెలంగాణ - telangana varthalu
15:57 August 07
కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం లేఖ
పీఆర్పీ నుంచి అక్రమంగా నీటిని తరలించాలన్న ఉద్దేశంతోనే తెలంగాణ చేస్తున్న విద్యుత్ ఉత్పత్తిపై ఆంధ్రప్రదేశ్ ఫిర్యాదు చేసిందన్న రజత్ కుమార్... శ్రీశైలం ప్రాజెక్టు జలవిద్యుత్ ప్రాజెక్టు అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు. భౌగోళిక స్వరూపం కారణంగా నీటిఎత్తిపోత, దాదాపు 35 లక్షల బోరుబావుల దృష్ట్యా తెలంగాణకు జలవిద్యుత్ పూర్తి స్థాయిలో ఉత్పత్తి అత్యవసరమని వివరించారు. సాగు, తాగునీరు, పారిశ్రామిక అవసరాల కోసం నాగార్జునసాగర్‌ను 405 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించారని... బచావత్ అవార్డు ప్రకారం 280 టీఎంసీల నీటిని శ్రీశైలం ద్వారా సాగర్‌కు తరలించాల్సి ఉంటుందని రజత్ కుమార్ పేర్కొన్నారు. వీటన్నింటి కోసం నాగార్జున సాగర్‌కు పూర్తి స్థాయిలో నీరు వదలాల్సిన అవసరం ఉందని తెలిపారు.
వీటన్నింటి నేపథ్యంలో పోతిరెడ్డిపాడు నుంచి ఆంధ్రప్రదేశ్ అక్రమంగా నీటిని తరలించకుండా తక్షణమే నిలువరించాలని కృష్ణా బోర్డును కోరారు. ఈ మేరకు నీటి తరలింపు నిలిపివేయాలని ఆంధ్రప్రదేశ్‌కు ఆదేశాలు జారీ చేయాలని... తద్వారా నాగార్జునసాగర్ వినియోగంపై ఎలాంటి ప్రభావం పడకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. లేఖ ప్రతిని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి కార్యాలయానికి, జలవనరుల విభాగం కార్యదర్శికి కూడా పంపారు.
ఇదీ చదవండి:CM KCR REVIEW: నీటిపారుదల శాఖపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష