మూడేళ్లుగా జూనియర్ అధ్యాపకులు పదోన్నతి పొందలేదని తెలంగాణ ప్రభుత్వ లెక్చరర్ల అసోసియేషన్ నిరసన బాట పట్టింది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈనెల 31లోగా జూనియర్ అధ్యాపకులను ప్రిన్సిపాల్స్‌గా, నాన్‌టీచింగ్ స్టాఫ్‌ను జూనియర్ అధ్యాపకులుగా పదోన్నతులు కల్పించాలని అసోసియేషన్ సభ్యులు డిమాండ్ చేశారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల కాంట్రాక్ట్ ఉద్యోగుల బదిలీలు నిలిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.
'ఫీజులు దుర్వినియోగం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోండి' - Telangana Intermediate Board in Nampally Hyderabad
అక్రమంగా డిప్యుటేషన్‌పై వచ్చిన కొంతమంది అధికారులు.. విద్యార్థుల ఫీజులను దుర్వినియోగం చేస్తున్నారని ప్రభుత్వ లెక్చరర్ల అసోసియేషన్ ఆందోళనకు దిగింది. హైదరాబాద్ నాంపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయం వద్ద బైఠాయించిన అసోసియేషన్ సభ్యులు అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
హైదరాబాద్ నాంపల్లిలోని ఇంటర్మీడియట్ కార్యాలయం వద్ద బైఠాయించిన లెక్చరర్లు.. విద్యార్థుల ఫీజులను దుర్వినియోగం చేస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వెంటనే వారని తొలగించి ఇంటర్ బోర్డును కాపాడాలని కోరారు.
ఫిబ్రవరి 1 నుంచి విద్యాసంస్థలు పునఃప్రారంభమవుతున్న దృష్ట్యా.. విద్యార్థులకు ఉచిత బస్‌పాస్, మధ్యాహ్న భోజన సౌకర్యం కల్పించాలని లెక్చరర్లు ప్రభుత్వానికి విన్నవించారు. తరగతి గదులు శానిటైజ్ చేయించేందుకు కళాశాలలకు నిధులు మంజూరు చేయాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 1452 అతిథి అధ్యాపకులు పోస్టులు వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇంటర్మీడియట్ బోర్డును కాపాడటానికి అక్రమ ప్రమోషన్లు, డిప్యుటేషన్లు ప్రభుత్వం వెంటనే అడ్డుకోవాలని లెక్చరర్ల అసోసియేషన్ డిమాండ్ చేసింది.