Measures to protect twin reservoirs: రాష్ట్ర ప్రభుత్వం జీవో 111 ఆంక్షలను ఎత్తివేసిన నేపథ్యంలో కార్యాచరణపై రాష్ట్ర పురపాలకశాఖ కసరత్తు ప్రారంభించింది. జీవో 69లో ప్రభుత్వం నిర్దేశించిన అంశాలపై ఉన్నతాధికారులు దృష్టిసారించారు. జీవో 111 స్ఫూర్తికి నష్టం కలగకుండా ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జలాశయాలను పరిరక్షిస్తూ... ఆ పరిధిలోని ప్రాంతాభివృద్ధి ప్రాతిపదికగా కార్యాచరణ ఉంటుందని పురపాలకశాఖ ఉన్నతాధికారి స్పష్టం చేశారు. పురపాలకశాఖ, జలమండలి, కాలుష్యనియంత్రణ మండలి సమన్వయంతో వ్యవహరించనున్నాయి. జలవనరుల పరిరక్షణ, పర్యావరణ సంరక్షణ, వాణిజ్య, నివాస జోన్‌ల గుర్తింపుతో పాటు రోడ్ల విస్తరణ, ప్రధాన రహదారులతో అనుసంధానం వంటి కీలకాంశాలపై సీఎస్ నేతృత్వంలోని కమిటీకి నివేదించాల్సి ఉంటుంది. జీవో 69 అమలు కార్యాచరణపై త్వరలోనే రోడ్‌మ్యాప్ సిద్ధం కానుంది.
జల వనరులు కలుషితం కాకుండా చర్యలు
జల వనరులు కలుషితం కాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలు కీలకం కానున్నాయి. జంట జలాశయాల పరిరక్షణకు ఇప్పటికే హైదరాబాద్‌లోని జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ సమగ్ర నివేదిక అందజేసింది. దీంతో పాటు నిపుణుల కమిటీ ఇచ్చిన సూచనలను పరిశీలించి పటిష్ఠ ప్రణాళికను రూపొందించనున్నారు. బఫర్ జోన్ ఎంత మేరకు ఉండాలి? జంట జలాశయాలకు వర్షపునీటిని తీసుకొచ్చే కాలువల వెంట నీటి ప్రవాహానికి అడ్డంకులు లేకుండా చూడటం.. మూసీ పరీవాహక ప్రాంతంలో పడే వర్షపునీరు నేరుగా జలాశయాల్లోకి చేరడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోనున్నారు. నివాస ప్రాంతాల్లోని మురుగునీరు శుద్ధి అయిన తర్వాత జలాశయాల్లోకి చేరకుండా నేరుగా మూసీలోకి వెళ్లేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. ఇది ప్రధాన కసరత్తు అవుతుందని ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు.
ప్రాంతాల జోనింగ్