కొవిడ్ కట్టడి చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రాత్రి పూట కర్ఫ్యూ విధించింది. మే ఒకటో తేదీ వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని ప్రకటించింది. రాత్రి తొమ్మిది గంటల నుంచి మరుసటి రోజు ఉదయం ఐదు గంటల వరకు రాత్రి కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. అన్ని కార్యాలయాలు, సంస్థలు, దుకాణాలు, హోటళ్లు, రెస్టారెంట్లను రాత్రి 8గంటల వరకే తెరిచి ఉంచాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ తెలిపారు. నిబంధనలు ఉల్లఘించిన వారిపై విపత్తు నిర్వహణ, ఐపీసీ చట్టాల ప్రకారం చర్యలు తీసుకుంటామన్న ప్రభుత్వం... ఆదేశాలను పటిష్ఠంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు, ఎస్పీలకు స్పష్టం చేసింది.
వీటికి మినహాయింపు..
ఆసుపత్రులు, డయోగ్నస్టిక్ ల్యాబ్స్, ఫార్మసీలకు మినహాయింపు ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. వీటితో పాటు మీడియా, టెలికమ్యూనికేషన్లు, ఈ-కామర్స్ డెలివరీ, పెట్రోల్ పంపులు, విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ, మంచినీటి సరఫరా, పారిశుద్ధ్యం, కోల్డ్ స్టోరేజీలు, ప్రైవేట్ సెక్యూరిటీ సేవలు, నిరంతరం ఉత్పత్తి చేసే సంస్థలు, సేవలకు మినహాయింపు ఇచ్చింది. వీరితో పాటు ప్రభుత్వ, స్థానిక సంస్థల ఉద్యోగులు, వైద్యులు, నర్సింగ్, పారా మెడికల్ సిబ్బంది, వైద్యసాయం కోసం వెళ్లే రోగులు, గర్భిణులు మినహా మిగతా వారి కదలికలను రాత్రి తొమ్మిది గంటల తర్వాత నిషేధించారు. విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్ల నుంచి వచ్చే వారు టికెట్లు చూపితే అనుమతిస్తారు. అంతర్‌రాష్ట్ర, అంతర్ జిల్లా సరుకు రవాణాపై ఎలాంటి ఆంక్షలు విధించలేదు. రాత్రి కర్ఫ్యూ సమయంలోనూ అనుమతి ఉన్న వారు ప్రయాణించేందుకు ఆటోలు, ట్యాక్సీలు తదితర ప్రజారవాణా వ్యవస్థకు సంబంధించిన వాహనాలను అనుమతిస్తారు.
ఆర్టీసీలో ప్రయాణ సమయం కుదింపు..