ఆశావహ దృక్పథంతో కొత్త ఆర్థిక సంవత్సరానికి స్వాగతం 2020-21 ఆర్థిక సంవత్సరం పూర్తిగా కరోనా ప్రభావంతోనే ముగిసింది. కరోనాతో ప్రకటించిన లాక్డౌన్, తదనంతర పరిణామాలతో అన్ని రంగాల కార్యకలాపాలు దాదాపుగా స్తంభించిపోయాయి. ఆర్థిక లావాదేవీలు తీవ్ర ఒడిదొడుకులకు లోనయ్యాయి. కార్యకలాపాలు లేకపోవడం వల్ల రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు ఆదాయం లేకుండా పోయింది.
40 శాతం అధికంగా అప్పులు..
ఏప్రిల్, మే నెలల్లో పూర్తిగా పడిపోయిన ఆదాయం.. ఆ తర్వాత సడలింపులతో క్రమేణా పెరుగుతూ వచ్చింది. ఈ ఏడాది జనవరిలో అత్యధికంగా రాష్ట్ర ఖజానాకు రూ. 7 వేల 812 కోట్ల పన్నుల ద్వారా ఆదాయం వచ్చింది. ఆదాయం తగ్గిపోవడం సహా వ్యయం పెరిగిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్పులపై ఎక్కువగా ఆధారపడాల్సి వచ్చింది. ఫిబ్రవరి నెలాఖరు వరకే రూ.46 వేల 700 కోట్ల రూపాయలను రుణాల ద్వారా సమీకరించుకొంది. బడ్జెట్ అంచనాలైన రూ. 33 వేల 241 కోట్ల కంటే 40 శాతం అధికంగా అప్పులు తీసుకుంది.
కాగ్ గణాంకాల ప్రకారం ఫిబ్రవరి వరకు 2020-21 బడ్జెట్లో రెవెన్యూ అంచనాలను రాష్ట్ర ప్రభుత్వం 74.37 శాతం చేరుకొంది. కేవలం ఆదాయాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకుంటే 58.98 శాతం అంచనాలను మాత్రమే చేరుకొంది. పన్నుల ఆదాయం, కేంద్రం నుంచి వచ్చిన నిధులు, అప్పులు అన్నీ కలిపితే 2020-21లో ఫిబ్రవరి వరకు 1,31,180 కోట్ల రూపాయల రెవెన్యూ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చింది. అందులో 1,21,414 కోట్ల రూపాయలు వ్యయం చేసింది. ఇందులో రెవెన్యూ వ్యయం 1,07,813 కోట్లు కాగా మూలధన వ్యయం 13,601 కోట్లు. ఆర్థిక సంవత్సరం మొత్తం రెవెన్యూ 1,47,000 కోట్ల రూపాయల వరకు ఉంటుందని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
అందుకు భిన్నంగా పెరుగుదల!
కరోనా, తదనంతర పరిణామాల నేపథ్యంలో నెలకొన్న ప్రతికూల పరిస్థితుల్లోనూ రాష్ట్రం మెరుగైన ఆర్థిక స్థితిలో నిలిచింది. దేశ జీడీపీ సగటు ఎనిమిది శాతం తగ్గగా.. రాష్ట్ర జీఎస్డీపీ మాత్రం అందుకు భిన్నంగా 1.3 శాతం స్వల్పంగా పెరిగింది. తలసరి ఆదాయంలోనూ స్వల్ప పెరుగుదల నమోదు చేసింది. దేశ తలసరి ఆదాయం 4.8 శాతం తగ్గగా.. రాష్ట్ర తలసరి ఆదాయం మాత్రం 0.6 శాతం మేర పెరిగింది. దేశ ఆదాయం తగ్గిన పరిస్థితుల్లోనూ రాష్ట్ర ఆదాయం పెరిగిందని, ప్రతికూల పరిస్థితుల్లోనూ రాష్ట్ర పురోగతి మెరుగ్గా ఉందని ప్రభుత్వం అంటోంది. దేశంలో తెలంగాణ ఒక ప్రబల ఆర్థిక శక్తిగా ఎదుగుతోందనడానికి ఇదే నిదర్శమని సర్కార్ చెబుతోంది. ఈ పరిస్థితుల్లో ఇవాళ్టి నుంచి ప్రారంభమైన కొత్త ఆర్థిక సంవత్సరం 2021-22కు భారీ బడ్జెట్‌తో రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. ఏకంగా 2,30,825 కోట్ల రూపాయల అంచనాతో పద్దును తీసుకొచ్చింది.
ఆశావహ దృక్పథంతో..
కరోనా, తదనంతర పరిణామాల నేపథ్యంలో ఆర్థిక కార్యకలాపాలు సాగుతున్నందున ఆదాయం పెరుగుతుందని, రాబడులు బాగానే ఉంటాయని రాష్ట్ర ప్రభుత్వం పూర్తి ఆశావహంగా ఉంది. అందుకు అనుగుణంగానే బడ్జెట్ను ప్రవేశపెట్టింది. వివిధ కారణాల వల్ల సాధ్యం కాకపోతే.. భూముల అమ్మకాలను పూర్తి చేసి 16 వేల కోట్ల రూపాయలు రాబట్టుకోవాలని లక్ష్యంగా పెట్టుకొంది. కేంద్రం నుంచి కూడా ఐజీఎస్టీ సెటిల్మెంట్ సహా ఇతర బకాయిలు, నిధులు, అదనపు గ్రాంట్లు వస్తాయని భావిస్తోంది. జీఎస్డీపీ పెరగడం సహా రుణపరిమితి కూడా నాలుగు శాతానికి పెరిగిన నేపథ్యంలో అదనపు రుణాలను తీసుకునే వెసులుబాటు కలిగింది. వీటన్నింటి నేపథ్యంలో కొత్త ఆర్థిక సంవత్సరంలో పరిస్థితులు ఆశాజనకంగానే ఉంటాయని ప్రభుత్వం విశ్వాసంగా కనిపిస్తోంది.
ఇవీచూడండి:పాన్-ఆధార్ లింక్ గడువు పొడిగింపు