ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి నెల వరకు ఆదాయ, వ్యయ వివరాలను రాష్ట్ర ప్రభుత్వం కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ - కాగ్‌కు నివేదించింది. ఆదాయానికి సంబంధించి బడ్జెట్ అంచనా అయిన లక్షా 76 వేల కోట్లకు గాను 64 శాతం మేర అంటే లక్షా 11వేల కోట్లు సాధించింది. పన్ను ఆదాయం అంచనాలను మాత్రం 92 శాతం వరకు అందుకొంది. పన్నుల ద్వారా లక్షా ఆరు వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని అంచనా వేయగా.. ఫిబ్రవరి నెలాఖరు వరకు 98వేల కోట్లు సమకూరాయి. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 30 వేల కోట్ల రూపాయల అదనపు పన్నురాబడి వచ్చింది. ఫిబ్రవరి నెలలో ఖజానాకు గరిష్టంగా 12,820 కోట్ల రూపాయల పన్ను ఆదాయం సమకూరింది. నిరుడు ఫిబ్రవరిలో వచ్చిన ఆదాయం కేవలం 7,538 కోట్లు మాత్రమే. పన్ను ఆదాయం ఇప్పటికే 92 శాతం వచ్చిన నేపథ్యంలో ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి బడ్జెట్ అంచనాలను అధిగమించే అవకాశం ఉందని అంటున్నారు.
అమ్మకం పన్ను, ఎక్సైజ్ పన్ను ఆదాయం అంచనాలను 92 శాతం చేరుకోగా.. స్టాంపులు - రిజిస్ట్రేషన్ల ద్వారా అంచనాల్లో 87 శాతం, జీఎస్టీ ద్వారా అంచనాల్లో 86 శాతం వచ్చింది. జీఎస్టీ ద్వారా 30 వేల కోట్లు, అమ్మకం పన్ను ద్వారా 26 వేల కోట్లు.. ఎక్సైజ్ ద్వారా 15 వేల కోట్లు, స్టాంపులు - రిజిస్ట్రేషన్ల ద్వారా 10 వేల కోట్ల ఆదాయం సమకూరింది. పన్నేతర ఆదాయం మాత్రం 30 వేల కోట్ల అంచనాకు గాను... 6 వేల కోట్లు మాత్రమే వచ్చింది. 38 వేల కోట్ల గ్రాంట్ల అంచనాలో కేవలం 7,700 కోట్లు వచ్చాయి. అప్పులు అంచనాల్లో 95 శాతం చేరుకున్నాయి.