యూరోపియన్ దేశాల పెట్టుబడులకు తెలంగాణ ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. యూరోపియన్ బిజినెస్ గ్రూప్ నిర్వహించిన ప్రతినిధుల సమావేశంలో మంత్రి వర్చువల్గా హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే ఐటీ, లైఫ్ సైన్సెస్, ఫార్మా, ఏరోస్పేస్, డిఫెన్స్, టెక్స్టైల్స్, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి 14 రంగాలను ప్రాధాన్యత రంగాలుగా ఎంచుకుని ఆయా రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న విషయాన్ని సమావేశంలో పాల్గొన్న ప్రతినిధులకు కేటీఆర్ వివరించారు.
వివిధ దేశాలతో పోటీ పడేందుకు సిద్ధం..
తెలంగాణ ప్రభుత్వం స్థానికంగా ఉన్న రాష్ట్రాలతోనే కాకుండా ఈ రంగాల్లో దూసుకెళ్తున్న వివిధ దేశాలతోనూ పోటీ పడేందుకు సిద్ధంగా ఉందని, ఇందుకు సంబంధించి భారీ పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేస్తున్నామని హైదరాబాద్ ఫార్మా సిటీ, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్, మెడికల్ డివైస్ పార్క్ వంటి అంశాలను ప్రస్తావించారు. రాష్ట్రంలోకి పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే ఏ వ్యాపార సంస్థ కైనా ఆయా కంపెనీ అవసరాల మేరకు, పెట్టుబడి మేరకు ప్రభుత్వ స్థలాన్ని కేటాయించేందుకు.. అవసరమైన స్థలం సిద్ధంగా ఉందని, తెలంగాణ వద్ద ఉన్న లాండ్ బ్యాంక్ గురించి వివరించారు.
ప్రభుత్వమే సొంత ఖర్చుతో శిక్షణ
తెలంగాణ ప్రభుత్వం కేవలం మౌలిక వసతులు సదుపాయాల కల్పనకు మాత్రమే కాకుండా మానవ వనరుల అభివృద్ధి, వారి శిక్షణకు సైతం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఇందులో భాగంగానే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే కంపెనీల అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వమే తన ఖర్చుతో శిక్షణ కార్యక్రమాలను చేపడుతోన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేశారు.