Oil Palm Cultivation in Telangana: రాష్ట్రంలో ఆయిల్‌పామ్ పంట సాగు ప్రోత్సాహంపై ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటోంది. పంట సాగుకు పుష్కలమైన అవకాశాలున్న దృష్ట్యా ఉద్యానశాఖ చర్యలు ఊపందుకున్నాయి. రాబోయే నాలుగేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 20 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు చేపట్టాలని ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించుకుంది. అందులో భాగంగా ఇప్పటికే 26 జిల్లాల్లోని నర్సరీల్లో నాణ్యమైన మొక్కలు సిద్ధం చేస్తున్నారు. 11 కంపెనీలు సేవలందించేందుకు ముందుకు వచ్చిన నేపథ్యంలో... వానాకాలంలో రెండున్నర లక్షల ఎకరాల్లో మొక్కలు నాటేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
ఆ పథకం విఫలం
గతంలో దేశానికి అవసరమైన వంట నూనెల లోటు అధిగమించేందుకు నూనెగింజల పంట సాగు, విస్తీర్ణం పెంచాలని 1990లో కేంద్రం నేషనల్ ఆయిల్‌పాం మిషన్ ప్రవేశపెట్టింది. ఈ మిషన్ కింద 40 నుంచి 50 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పాం సాగు చేయాలన్నది లక్ష్యం. అప్పట్లో పెద్ద ఎత్తున నిధులు వెచ్చించినా విధివిధానాలు లోపభూయిష్టంగా ఉండటం వల్ల పథకం విఫలమైంది. గత అనుభవాల దృష్ట్యా 2021లో ప్రధాని నరేంద్ర మోదీ... నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్, ఆయిల్‌పామ్ ప్రవేశపెట్టారు. ఈ మిషన్ కింద 2025 నాటికి దేశవ్యాప్తంగా 6.5 లక్షల హెక్టార్లలో ఆయిల్‌పామ్ సాగులోకి తీసుకురావాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో ఆయిల్‌పామ్ ఉత్పత్తిలో తెలంగాణను అగ్రస్థానంలో నిలబెట్టేందుకు ఉద్యానశాఖ కృషి చేస్తోంది.