కొత్త జోనల్ విధానం ఖరారు కావడం వల్ల... జిల్లా, జోన్, బహుళ జోన్ల కింద ఉద్యోగుల వర్గీకరణ ప్రక్రియను ప్రభుత్వం చేపట్టనుంది. ఆ తర్వాత జనాభా ప్రాతిపదికన ఏయే జిల్లాలకు ఎంతమంది ఉద్యోగులు ఉండాలనే అంశంపైనా కసరత్తు చేయనుంది. త్వరలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్... అన్ని శాఖల అధికారులు, కార్యదర్శులు, కలెక్టర్లతో సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్రంలో 2018 అక్టోబరు నుంచి 2019 జనవరి వరకు జిల్లాల పునర్వవ్యవస్థీకరణ జరిగింది. జిల్లాల సంఖ్య 10 నుంచి 33కి పెరిగింది. అప్పట్లో ఉద్యోగులను తాత్కాలికంగా సర్దుబాటు చేశారు. ఇప్పుడు జిల్లాల పునర్వవ్యవస్థీకరణ పూర్తై కొత్త జోనల్ వ్యవస్థకు కేంద్రం ఆమోదం తెలపడంతో ప్రతి జిల్లాలో ఉండాల్సిన ఉద్యోగుల సంఖ్యను ప్రభుత్వం తేల్చాల్చి ఉంది.
జోనల్ వ్యవస్థకు ఆమోదంతో తదుపరి ప్రక్రియపై సర్కారు దృష్టి..! - ప్రభుత్వం దృష్టి
కొత్త జోనల్ వ్యవస్థకు కేంద్రం ఆమోదం తెలపడంతో త్వరలోనే తదుపరి ప్రక్రియపై ప్రభుత్వం దృష్టి సారించనుంది. జిల్లా, జోనల్, బహుళ జోనల్ కింద ఉద్యోగులను వర్గీకరించనున్న సర్కారు.. జిల్లాల వారీగా సంఖ్యను ఖరారు చేయనుంది. కొత్త విధానం వల్ల సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఉద్యోగ సంఘాల నేతలు అభిప్రాయపడుతున్నారు.
ముందుగా జిల్లా, జోన్, బహుళజోన్ల స్థాయి పోస్టులను నిర్ధారించాలి. ఇప్పటికే ఉద్యోగ, అధికార సంఘాలు నాలుగోతరగతి నుంచి జూనియర్ అస్టిస్టెంట్ పైస్థాయి వరకు పోస్టులను జిల్లా సీనియర్ అసిస్టెంట్ పైస్థాయిలోని వారిని.... జోనల్, గెజిటెడ్ అధికారులను బహుళ జోన్ పోస్టులుగా వర్గీకరించాలని అభ్యర్థించాయి. వివిధ శాఖలు తమ పరిధిలో పనిచేసే ఉద్యోగుల సంఖ్య ఆధారంగా వర్గీకరించి ఆ జాబితాను ప్రభుత్వానికి ఇవ్వాలి. ఆ తర్వాత ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చించి ముఖ్యమంత్రి ఆమోదానికి పంపుతారు. ప్రస్తుతం పోస్టుల విషయంలో సమతూకం లేదు. చిన్న జిల్లా అయిన ములుగు, పెద్దజిల్లా అయిన వరంగల్‌కు ఒకే సంఖ్యలో ఉద్యోగులు ఉన్నారు. జనాభా ప్రాతిపదికన ఉద్యోగుల సంఖ్యను ప్రభుత్వం నిర్ణయించాలి. ఉద్యోగ సంఘాలతో చర్చించి ప్రభుత్వం ఖరారు చేయనుంది. ఉద్యోగుల వర్గీకరణ, సంఖ్య ప్రక్రియ ఆమోదం త్వరితగతిన పొందినా ప్రస్తుతం నెలకొన్న కరోనా పరిస్థితుల దృష్ట్యా... కొన్ని నెలల తర్వాత ఆ విధానం అమలు చేసే అవకాశం ఉంది.
ఉద్యోగుల సమస్యలకు కొత్త జోనల్ విధానంతో పరిష్కారం లభిస్తుందని టీఎన్జీవో, టీజీవో అధ్యక్షుడు రాజేందర్, మమత అభిప్రాయపడ్డారు. కొత్త విధానం వల్ల ఉద్యోగులకు సంపూర్ణ న్యాయం జరుగుతుందని తెలిపారు ఉద్యోగుల వర్గీకరణ, జిల్లాలో పోస్టుల సంఖ్య తేలిన తర్వాత పదోన్నతులతో పాటు ఖాళీలపైన స్పష్టత వస్తుందని వివరించారు.