తెలంగాణ

telangana

ETV Bharat / city

నకిలీ విత్తన విక్రయాలపై ఉక్కుపాదం.! - kcr oders to eradicate fake seeds

ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌ ప్రారంభమైన నేపథ్యంలో వ్యాపారులు, దళారులు నాసిరకం విత్తన దందాకు తెరలేపారు. నాసిరకం విత్తనాలు విక్రయించే వ్యాపారులపై పీడీ చట్టం ప్రయోగించాలని ముఖ్యమంత్రి ఆదేశాలతో పోలీసులు రంగంలోకి దిగారు. తాజాగా మేడ్చల్ జిల్లా శామీర్‌పేటలో నాసిరకం హెచ్‌టీ పత్తి, మొక్కజొన్న విత్తనాలు విక్రయిస్తున్న నలుగురు సభ్యుల ముఠాను సైబరాబాద్ ఎస్‌ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరో ఏజెంటు కోసం గాలిస్తున్నారు. రూ. 52 లక్షల విలువైన నాసిరకం విత్తనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

seeds news
ప్రభుత్వం అప్రమత్తం.. నకిలీ విత్తన విక్రయాలపై ఉక్కపాదం

By

Published : Jun 5, 2020, 10:23 PM IST

నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకిన నేపథ్యంలో... ఏరువాక పౌర్ణమి ఇవాళ ప్రారంభమైంది. భూముల దుక్కి దున్ని.. విత్తనాల సేకరణకు రైతులు సమాయత్తమవుతున్నారు. అదే అదనుగా కొందరు వ్యాపారులు, దళారులు నాసిరకం విత్తనాలు అంటగట్టడానికి పల్లెల్లోకి ప్రవేశిస్తున్నారు.

నాసిరకం విత్తనాల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలంటూ సాక్షాత్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యాఖ్యల నేపథ్యంలో వ్యవసాయ, పోలీసు శాఖ అప్రమత్తమైంది. ఇప్పటికే గ్రామాల్లో నియంత్రిత పంట సాగు విధానంపై విస్తృత అవగాహన కల్పించడంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, రైతుబంధు సమితి ప్రతినిధులు నిమగ్నమై ఉన్న వేళ.. దళారులు తమ బుద్ధి ప్రదర్శిస్తున్నారు.

ఈ వానా కాలం సీజన్‌లో 65 లక్షల ఎకరాల విస్తీర్ణంలో పత్తి పంట సాగుచేయాలని వ్యవసాయ శాఖ ప్రణాళికలు రచించింది. అదనుగా భావించిన కొందరు నాసిరకం పత్తి విత్తనాలను విక్రయిస్తున్నారు.

తాజాగా మేడ్చల్‌ జిల్లా శామీర్‌పేటలో నాసిరకం పత్తి, మొక్కజొన్న విత్తనాలు విక్రయిస్తున్న నలుగురు ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. కడప జిల్లాకు చెందిన కల్లె శ్రీనివాస్‌.. ముఠాకు నేతృత్వం వహిస్తున్నాడు. ఇతను వ్యవసాయ పట్టభద్రుడు. పలు విత్తన కంపెనీల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. సొంతంగా శామీర్‌పేటలో వికాస్ బయోసైన్స్ పేరిట సంస్థ నెలకొల్పాడు. డబ్బు సులభంగా సంపాదించాలన్న కాంక్షతో నాసిరకం విత్తనాల దందాకు బరితెగించాడు.

శ్రీనివాస్‌తోపాటు సంగారెడ్డి జిల్లా సదాశివపేటకు చెందిన రాములు, వెంకటేష్‌, రంగారెడ్డి జిల్లాకు చెందిన రామచంద్రయ్య, వికారాబాద్​కు చెందిన వెంకటరెడ్డి కలిసి ఓ ముఠాగా ఏర్పడ్డారు. రైతులకు నిషేధిత హెచ్‌టీ పత్తి, మొక్కజొన్న విత్తనాలు భారీ ఎత్తున అంటగట్టారు. పక్కా సమాచారంతో సైబరాబాద్ ఎస్‌ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు.

నాసిరకం విత్తనాల విక్రయ దందాకు సహకరించిన మరో ఏజెంట్ మహ్మద్ హుస్సేన్‌ పరారీలో ఉన్నాడు. ఇతను సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం దౌల్తాబాద్​కు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ఇతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. గతంలోను నాసిరకం విత్తనాల విక్రయాల్లో వ్యాపారులకు సహకరించినట్లు సమాచారం.

ఇవీచూడండి:'ఇరు రాష్ట్రాలు కొత్త ప్రాజెక్టుల డీపీఆర్​లు ఇవ్వాలి'

ABOUT THE AUTHOR

...view details