పూర్తి పారదర్శకంగా, జవాబుదారీతనంతో ప్రజలకు సులువుగా సేవలు అందేలా రాష్ట్ర ప్రభుత్వం కొత్త రెవెన్యూ విధానాన్ని అమలు చేయనుంది. ఉభయసభలు ఆమోదించిన బిల్లులకు గవర్నర్ ఆమోదముద్రతో గెజిట్ నోటిఫికేషన్ కూడా జారీ అయింది. కొత్త చట్టాలకు అనుగుణంగా రెవెన్యూ శాఖ మార్గదర్శకాలు ప్రకటించాల్సి ఉంది. వాటి ఆధారంగానే తదుపరి రెవెన్యూ రికార్డుల లావాదేవీలు, రిజిస్ట్రేషన్లు, ధరణిలో అమలు జరగాల్సి ఉంటుంది. ఇకనుంచి వ్యవసాయ ఆస్తుల రిజిస్ట్రేషన్‌తో పాటు మ్యుటేషన్ తహసీల్దార్, వ్యవసాయేతర ఆస్తులను సబ్ రిజిస్ట్రార్ చేయాల్సి ఉంటుంది. అందుకు అనుగుణంగా అవసరమైన నిబంధనలను పొందుపర్చాల్సి ఉంటుంది.
ధరణితో ప్రారంభంతో పాటే రిజిస్ట్రేషన్లు కూడా
ఆస్తులన్నింటినీ పూర్తిగా ఆన్లైన్లో నమోదు చేసి ఇక నుంచి కోర్ బ్యాంకింగ్ విధానం తరహాలో ధరణి వెబ్సైట్ ద్వారానే భూముల లావాదేవీలు జరగనున్నాయి. విజయదశమి రోజు ధరణి పోర్టల్ ను ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. కొత్త రెవెన్యూ విధానం అమల్లోకి వస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో రిజిస్ట్రేషన్లను ప్రభుత్వం నిలిపివేసింది. ధరణి పోర్టల్ ప్రారంభంతో పాటే రిజిస్ట్రేషన్లు కూడా ప్రారంభం కానున్నాయి. ధరణి పూర్తి స్థాయిలో ప్రారంభం కావాలంటే రెవెన్యూ సంబంధిత కొత్త చట్టాలను నోటిఫై చేయాల్సి ఉంటుంది. వచ్చే నెల 25వ తేదీన దసరా పండుగ ఉన్న నేపథ్యంలో అంతకు రెండు రోజుల ముందైనా కొత్త చట్టాలను నోటిఫై చేయాల్సి ఉంటుంది. అందుకు అనుగుణంగా కొత్త చట్టాల మార్గదర్శకాలను ప్రకటించాల్సి ఉంది.