రాష్ట్రంలో లాక్‌డౌన్ ఆంక్షల నేపథ్యంలో నిత్యావసర వస్తువుల పంపిణీపై సర్కారు ప్రత్యేక దృష్టి సారించింది. లాక్‌డౌన్ మార్గదర్శకాలు అమల్లో ఉన్న దృష్ట్యా... ఉదయం 6 నుంచి 10 గంటల వరకు చౌకధరల దుకాణాలు నడుస్తాయి. ఇదే అదునుగా తీసుకుని టోకు, చిల్లర వ్యాపారులెవరైనా... బియ్యం, పప్పు దినుసులు, వంట నూనెలు, పాలు, ఇతర నిత్యావసర వస్తువులు, వంట గ్యాస్ అక్రమంగా నిల్వ చేయడం, తరలించడం, అధిక రేట్లకు విక్రయించడం, తూకాల్లో తేడాలకు పాల్పడితే సహించబోమని ప్రభుత్వం హెచ్చరించింది. ఎవరైనా ఆ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఉద్ఘాటించింది.
లాక్‌డౌన్ దృష్ట్యా... ఆయా అంశాలపై చీఫ్ రేషనింగ్ ఆఫీసర్ శ్రీమతి బి. బాలమాయాదేవి అధ్యక్షతన జరిగిన ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో పౌరసరఫరాల, రవాణ శాఖల కమిషనర్లు, హైదరాబాద్, వరంగల్ డీఐజీలు, ఔషధ నియంత్రణ విభాగం, ఉద్యాన, మార్కెటింగ్ శాఖ డైరెక్టర్లు, తూనికల కొలతల విభాగం కంట్రోలర్, పాడిపరిశ్రాభివృద్ధి సహకార సంస్థ ఎండీ, ఎల్‌పీపీ, దాల్‌మిల్, ఆయిల్‌మిల్స్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. పది రోజులపాటు లాక్‌డౌన్ కొనసాగనున్న తరుణంలో నిరంతరం నిఘా కొనసాగించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఎక్కడా కూడా వినియోగదారులకు నిత్యావసర వస్తువుల కొరత ఉత్పన్నం కాకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని వాణిజ్య, వ్యాపార సంఘాలకు సూచించారు.