తెలంగాణ

telangana

ETV Bharat / city

భద్రతావలయంలో బీఆర్కేఆర్​ భవనం - burgula ramakrishna rao bhawan

బీఆర్కేఆర్ భవన్ చుట్టూ త్వరలో ఓ భద్రతావలయం ఏర్పాటు కానుంది. భవన పరిసరాలను హై సెక్యూరిటీ జోన్ గా ప్రకటించనున్నారు. ముందున్న మూడు రోడ్లను మూసేసి ట్రాఫిక్ మళ్లించనున్నారు. వీవీఐపీల రక్షణ, పార్కింగ్ స్థలం ఏర్పాటు తదితర అంశాలను పరిశీలించి ఓ రిపోర్ట్ ఇవ్వాలని పోలీసుశాఖను ప్రభుత్వం కోరింది.

telangana government focus on brk bhawan security

By

Published : Jul 11, 2019, 10:34 AM IST

Updated : Jul 11, 2019, 11:25 AM IST

భద్రతావలయంలో బీఆర్కేఆర్​ భవనం

నూతన సచివాలయ నిర్మాణం నేపథ్యంలో సీఎంవో, సీఎస్ కార్యాలయం, ఇతర ప్రధాన శాఖలన్నీ బీఆర్కేఆర్ భవన్​కు తరలుతున్నాయి. ఎస్పీఎఫ్, ఐఎస్​డబ్ల్యూ, సీఎస్​డబ్ల్యూ, ఐబీ, ఎస్బీ, లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ ఇలా అన్ని విభాగాల సమన్వయంతో పోలీస్ శాఖ బీఆర్కేఆర్ భవన్, ఆ పరిసరాలను క్షుణ్ణంగా అధ్యయనం చేస్తోంది. రక్షణ ఏర్పాట్లపై రెండ్రోజుల్లో ప్రభుత్వానికి సంపూర్ణ నివేదిక ఇవ్వనుంది.

బీఆర్కేఆర్​ భవన్​ పరిసరాలు పరిశీలన

హోం శాఖకు సంబధించిన వివిధ బృందాలు ఇప్పటికే బీఆర్కేఆర్ భవన్ దాని పరిసర ప్రాంతాలను పరిశీలించాయి. జీహెచ్ఎంసీ గేట్ దగ్గర, రిట్జ్ హోటల్ కింద కళాంజలి సమీపంలో.. మధ్యలో ఎమ్మెల్యే క్వార్టర్స్ పక్కనే ఉన్న రోడ్లు, హోప్ హాస్పిటల్ దగ్గర బారికేడ్లు ఏర్పాటు చేయనున్నారు. తెలుగుతల్లి ఫ్లై ఓవర్ కింద బీఆర్కేఆర్ భవన్ వైపు వెళ్లే జంక్షన్​ వద్ద వాహన రాకపోకలను నిలువరించనున్నారు. ఆ చుట్టుపక్కల ఉన్న రహదారులన్నిటినీ మూసేయాలని ప్రభుత్వానికి నివేదించనున్నారు.

ప్రధాన సమస్య ట్రాఫిక్​

పలు శాఖలు బూర్గుల రామకృష్ణారావు భవన్​కు తరలితే పార్కింగ్ ఓ ప్రధాన సమస్యగా మారనుంది. బీఆర్కేఆర్ భవన్​లో కొన్ని, దాని ముందు రోడ్డుపై మరికొన్ని వాహనాలు పార్క్ చేసే వెసులుబాటు ఉంది. పక్కనే ఉన్న ఎమ్మెల్యే క్వార్టర్స్​లోని ఖాళీ స్థలాన్ని సైతం పార్కింగ్ కోసం ఉపయోగించుకునే విధంగా ట్రాఫిక్ పోలీసులు ప్రభుత్వానికి సూచనలు చేయనున్నారు.

రెండ్రోజుల్లో నివేదిక

ఇవన్నీ పరిగణలోకి తీసుకొని బీఆర్కేఆర్ భవన్, ఎమ్మెల్యే క్వార్టర్స్, ఆ పరిసరాలను హై సెక్యూరిటీ జోన్​గా ప్రకటించి, ఆ ప్రాంతంలోని రహదారులపై వాహన రాకపోకలను అనుమతించకుండా నిషేధాజ్ఞలు జారీ చేయాలని పోలీస్ శాఖ ప్రభుత్వాన్ని కోరనుంది. ఈ వివరాలన్నిటినీ క్రోడీకరిస్తూ హోంశాఖ రెండ్రోజుల్లో ప్రభుత్వానికి ఓ నివేదిక ఇవ్వనుంది.

Last Updated : Jul 11, 2019, 11:25 AM IST

ABOUT THE AUTHOR

...view details