తెలంగాణ

telangana

ETV Bharat / city

School Rationalization: టీచర్‌ పోస్టుల హేతుబద్ధీకరణ, బడుల విలీనానికి సర్కారు కసరత్తు

బడుల విలీనం, ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణపై కసరత్తుకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. బోధన సిబ్బంది హేతుబద్ధీకరణ, పాఠశాలల విలీనం కోసం జిల్లా స్థాయిలో కలెక్టర్ అధ్యక్షతన ఐదుగురు సభ్యుల కమిటీలను ఏర్పాటు చేస్తూ జీవో జారీ చేసింది. విద్యార్థుల సంఖ్యను ప్రతీ పాఠశాలలో కనీసం ఒక రెగ్యులర్ టీచర్ ఉండాలని సర్కారు స్పష్టం చేసింది. ప్రాథమిక పాఠశాలల్లో ఇరవై మంది లోపు విద్యార్థులకు ఒక ఎస్జీటీ, 150 మంది విద్యార్థులుంటే ప్రధానోపాధ్యాయుడు ఉండాలని మార్గదర్శకాల్లో పేర్కొంది. ఒకే ఆవరణలో ఉన్న సర్కారు బడులను విలీనం చేయనున్నారు.

telangana government Exercise to School Rationalization
telangana government Exercise to School Rationalization

By

Published : Aug 18, 2021, 4:24 AM IST

సర్కారు బడుల్లో ఉపాధ్యాయ పోస్టుల హేతుబద్ధీకరణతో పాటు పాఠశాలల విలీనానికి కసరత్తు ప్రారంభమైంది. హేతుబద్ధీకరణపై కసరత్తు కోసం మార్గదర్శకాలు విడుదల చేయడంతో పాటు.. జిల్లా స్థాయి కమిటీల ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవో 25 జారీ చేసింది. పాఠశాలల విలీనం, బోధన సిబ్బంది హేతుబద్ధీకరణ కోసం 2015లోనే ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఉపాధ్యాయ సంఘాల అభ్యంతరాలతో పాటు.. పలు సాంకేతిక కారణాలతో ప్రక్రియ నిలిచిపోయింది. హేతుబద్ధీకరణ, విలీనం ప్రక్రియ చేపట్టాలని గత నెల 31న పాఠశాల విద్య కమిషనర్ ప్రభుత్వాన్ని కోరారు. కొన్ని బడుల్లో విద్యార్థులకు మించి ఉపాధ్యాయలు ఉన్నారని.. మరికొన్ని పాఠశాలల్లో కనీస బోధన సిబ్బంది లేరని.. నాణ్యమైన విద్య కోసం హేతుబద్ధీకరణ అవసరమని పాఠశాల విద్య కమిషనర్ పేర్కొన్నారు.

కలెక్టర్​ ఛైర్మన్​గా జిల్లా స్థాయి కమిటీలు..

హేతుబద్ధీకరణ, విలీన ప్రక్రియ కోసం జిల్లా స్థాయిలో కమిటీలు ఏర్పాటయ్యాయి. జిల్లా కలెక్టర్ ఛైర్మన్ గా, డీఈవో సభ్య కార్యదర్శిగా, అదనపు కలెక్టర్, జిల్లా పరిషత్ సీఈవో, ఐటీడీఏ పీవో సభ్యలుగా ఉంటారు. పాఠశాలల్లో 2019-20 సంవత్సరంలో విద్యార్థుల సంఖ్య ఆధారంగా కమిటీ పోస్టులను ఖరారు చేస్తుంది. కమటీ నిర్ణయాలపై అభ్యంతరాలుంటే పాఠశాల విద్య కమిషనర్​కు ఫిర్యాదు చేయవచ్చునని జీవోలో పేర్కొన్నారు. అభ్యంతరాలను పాఠశాల విద్య కమిషనర్ పది రోజుల్లో పరిష్కరించాలని సర్కారు స్పష్టం చేసింది.

విద్యార్థుల సంఖ్యను బట్టి సార్లు..

ప్రాథమిక పాఠశాలల్లో 19 మంది వరకు విద్యార్థులుంటే.. ఒక ఎస్జీటీ ఉండాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. ఆ తర్వాత విద్యార్థుల సంఖ్యను బట్టి పాఠశాలలో 11 మంది వరకు ఉపాధ్యాయలు ఉండేలా పోస్టులు ఖరారు చేయాలని మార్గదర్శకాల్లో వివరించింది. ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థులు 150 మందికన్నా ఎక్కువగా ఉంటే ప్రధానోపాద్యాయుడి పోస్టు ఉండాలని తెలిపింది. ప్రాథమికోన్నత పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను బట్టి కనీసం నలుగురి నుంచి 12 వరకు ఉపాధ్యాయలు ఉండాలని పేర్కొంది. ప్రాథమికోన్నత పాఠశాలల్లో అత్యంత సీనియర్ స్కూల్ అసిస్టెంట్ ప్రధానోపాధ్యాయుడిగా వ్యవహరిస్తారు. స్కూల్ అసిస్టెంట్లు, భాష పండితులు వారి సబ్జెక్టుతో పాటు అసరమైతే ఇతర సబ్జెక్టులు కూడా బోధించాలని తెలిపింది. ఉన్నత పాఠశాలల్లో 220 లోపు విద్యార్థులు ఉంటే.. ప్రధానోపాధ్యాయుడు సహా 9 మంది ఉపాధ్యాయులు ఉండాలని మార్గదర్శకాల్లో పేర్కొంది. విద్యార్థుల సంఖ్యను కనీసం 9 మంది నుంచి గరిష్టంగా 45 మంది ఉపాధ్యాయులు ఉండేలా పోస్టులను ఖరారు చేయనున్నారు. తెలుగు, ఆంగ్ల మాధ్యమం రెండూ ఉంటే అదనపు సెక్షన్లను ఏర్పాటు చేస్తారు. అవసరమైతే తెలుగు మాధ్యమం ఉపాధ్యాయులు కూడా ఆంగ్ల మాధ్యమం విద్యార్థులకు బోధించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

విలీనంపై కూడా కసరత్తు...

బడుల విలీనంపై కూడా జిల్లా స్థాయి కమిటీలు కసరత్తు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఒక ప్రాంగణంలో రెండు లేదా అంతకన్నా ఎక్కువ ప్రాథమిక, లేదా ప్రాథమికోన్నత లేదా ఉన్నత పాఠశాలలు ఉంటే.. వాటిని విలీనం చేయాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. రెండు లేదా అంతకన్నా ఎక్కువ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలు ఉంటే.. ఒకే పాఠశాలలో విలీనం చేస్తారు. రెండు లేదా అంతకన్నా ప్రాథమికోన్నత పాఠశాలలు, ఉన్నత పాఠశాలలు ఒకే ప్రాంగణంలో ఉంటే.. ఉన్నత పాఠశాలలో విలీనం చేస్తారు. బాలికల పాఠశాలలను మాత్రం బాలుర లేదా కో-ఎడ్యుకేషన్ బడుల్లో విలీనం చేయకుండా యథాతథంగా కొనసాగించాలని మార్గదర్శకాల్లో పేర్కొంది.

ఇదీ చూడండి:

ktr: 'జేఎన్​యూ గోడలపై రాసిన ఆ కొటేషన్ నన్ను రాజకీయాలవైపు నడిపింది'

ABOUT THE AUTHOR

...view details