రాష్ట్రంలో రెండో డోసు టీకాల ప్రక్రియను ఒకవైపు కొనసాగిస్తూనే వైరస్ వాహకులుగా గుర్తించిన వారికి తొలి డోసు టీకాలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముందుగా జీహెచ్‌ఎంసీ పరిధిలో ప్రారంభిస్తారు. తర్వాత వరంగల్, ఖమ్మం, కరీంనగర్ తదితర కార్పొరేషన్లకు విస్తరించనున్నారు. ఎప్పుడు ప్రారంభించేది కచ్చితంగా నిర్ణయించకపోయినా.. వైద్యవర్గాల సమాచారం మేరకు ఈ నెల 28 నుంచి ప్రత్యేక టీకాల కార్యక్రమాన్ని ప్రారంభించే యోచనలో ఉన్నట్లు తెలిసింది. తొలుత ఆటోడ్రైవర్లతో టీకాల పంపిణీని ప్రారంభించి, దశలవారీగా ఒక్కో కేటగిరీ వారికి ఇస్తారు.
18-44 ఏళ్ల కేటగిరీలో..
45 ఏళ్లు పైబడినవారికి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఉచితంగా టీకాలను అందజేస్తుండగా.. 18-44 ఏళ్ల మధ్యవయస్కుల వారికి ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వమే టీకాలను కొనుగోలు చేస్తోంది. తాజాగా వాహకులకు ఇవ్వనున్నవి 18-44 ఏళ్ల కేటగిరీలో కొనుగోలు చేస్తున్నవే. ఈ వయసు వారు రాష్ట్రంలో సుమారు 1.90 కోట్ల మంది ఉండగా.. వీరికి రెండు డోసులు అందించాలంటే 3.80 కోట్ల డోసులు అవసరం. టీకాల వృథాను కూడా పరిగణనలోకి తీసుకుంటే.. 18-44 ఏళ్ల మధ్యవయస్కులకు టీకాలివ్వడానికి మొత్తంగా సుమారు 4 కోట్ల డోసులు అవసరమవుతాయని వైద్యవర్గాల అంచనా. ఇప్పటికే కోటి డోసుల కోసం గ్లోబల్ టెండర్లను పిలిచిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ టెండర్‌లో పాల్గొనడానికి అర్హత పొందినవి కొవిషీల్డ్, కొవాగ్జిన్, స్పుత్నిక్ టీకాలు మాత్రమే. ఈ మూడింటినే సాధ్యమైనన్ని ఎక్కువ కొనుగోలు చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 10 లక్షల కొవాగ్జిన్ టీకాలను కొనుగోలు చేసింది. వీటిలో 2.5 లక్షలు బుధవారం చేరుకునే అవకాశాలున్నాయి. మిగిలినవీ సాధ్యమైనంత త్వరగా రాష్ట్రానికి చేరేలా ప్రభుత్వం చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. ఇవి కాకుండా మరో 8.5 లక్షల కొవిషీల్డ్ టీకా డోసుల కొనుగోలుకూ ఏర్పాట్లు పూర్తయ్యాయి. వచ్చిన టీకాలను వచ్చినట్లుగా ముందుగా సూపర్ స్ప్రెడర్లకు ఇవ్వాలని ఉన్నతాధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఈ కార్యక్రమాన్ని సాధ్యమైనంత వేగంగా నిర్వహించి జూన్ 30లోగా పూర్తిచేయాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు. అప్పటిలోగా నిర్దేశిత 30 లక్షల మందికి పూర్తి కాకపోయినా.. ప్రక్రియ కొనసాగుతుందని వైద్యవర్గాలు తెలిపాయి. గ్లోబల్ టెండర్లకు వచ్చే స్పందనను బట్టి.. అందుబాటులోకి వచ్చిన డోసులకు అనుగుణంగా 18-44 ఏళ్ల మధ్య వయస్కులకు పంపిణీకి ఏర్పాట్లు చేయాలని నిర్ణయించింది.
మరిన్ని ప్రైవేటు ఆసుపత్రులకు కొవిడ్ చికిత్సల అనుమతి
రాష్ట్రంలో కొవిడ్ చికిత్సల కోసం ఇప్పటికే అనుమతిచ్చిన ప్రైవేటు ఆసుపత్రులకు అదనంగా కొత్తగా ఎన్ని ఆసుపత్రులు ముందుకొచ్చినా వెంటనే అనుమతులు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. టీకాల పంపిణీలోనూ ప్రైవేటు ఆసుపత్రులను ప్రోత్సహించనున్నారు. ప్రైవేటులో టీకాలిచ్చేందుకు ఆయా ఆసుపత్రులే సొంతంగా కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది. కొనుగోలులో ఇబ్బందులు తలెత్తినా.. సాఫ్ట్‌వేర్ సంస్థల వద్దకో, గేటెడ్ కమ్యూనిటీ వద్దకో వెళ్లి టీకాలివ్వాలని భావించినప్పుడు.. అందుకు సహకరించాలని ఉన్నతాధికారులను ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్రంలో కరోనా నిర్ధారణ పరీక్షలనూ పెద్దసంఖ్యలో నిర్వహించాలనీ, కిట్ల కొరత లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని తెలిపింది. జిల్లాల్లో అవసరాలకు తగ్గట్లుగా వైద్యులు, నర్సులు, ఇతర మానవ వనరుల నియామకాలపై వెంటనే దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్లు, ఇతర అధికారులకు ఆదేశాలు జారీచేసింది.
18 ఏళ్లు దాటిన వారికీ ప్రైవేటులో వ్యాక్సీన్లు
రాష్ట్రంలోని ప్రైవేటు ఆసుపత్రుల్లో 18 ఏళ్లు దాటిన వారికి కూడా టీకాలను ఇవ్వవచ్చని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ జి.శ్రీనివాసరావు తెలిపారు. సాఫ్ట్‌వేర్ సంస్థలు, బహుళ గృహ సముదాయాలు, పెద్దసంఖ్యలో ఉద్యోగులున్న సంస్థల వద్దకెళ్లి టీకాలు ఇవ్వడానికి ఇకనుంచి ఎటువంటి అభ్యంతరాలు ఉండబోవని ఆయన స్పష్టంచేశారు. అయితే టీకాల పంపిణీ సమాచారాన్ని కచ్చితంగా కొవిన్ పోర్టల్‌లో పొందుపర్చాలని, కొవిన్ నిబంధనలను పాటించాలని సూచించారు.
వైరస్ బారిన పడడానికి ఎక్కువ అవకాశమున్నవారు
- వంటగ్యాస్ సరఫరా చేసేవారు
- నిత్యావసర సరకుల డీలర్లు
- పెట్రోల్ బంకుల్లో పనిచేసేవారు
- ఆటో, క్యాబ్ డ్రైవర్లు
- రైతుబజార్లలో కూరగాయలు, పండ్లు, పూల విక్రయదారులు
- వ్యవసాయ మార్కెట్‌లో హమాలీలు
- కిరాణా, మద్యం, మాంసం దుకాణాల్లో పనిచేసేవారు
- హోటళ్లు, సెలూన్లలో పనిచేసేవారు
- ఎరువుల దుకాణాల్లో పనిచేసేవారు
- అన్నిమతాల ప్రార్థనమందిరాల్లో పూజారులు
- నిత్యం ప్రజలతో ఏదో రకంగా సంబంధాలు కొనసాగించేవారు