కరోనా చికిత్సకు పాత ధరలు.. అమలుచేయకపోతే కఠిన చర్యలు - price of corona treatment in telangana
కరోనా చికిత్సలకు పాత ధరలే ఖరారు చేస్తూ రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ధరలు తమకు ఏమాత్రం సమ్మతం కాదని ప్రైవేట్ ఆస్పత్రులు విన్నవించినా వాటిని తోసిపుచ్చింది. ప్రభుత్వం నిర్దేశించిన ధరలు కచ్చితంగా అమలు చేయాలని లేనియెడల కఠిన చర్యలుంటాయని హెచ్చరించింది.
కరోనా చికిత్స, తెలంగాణలో కరోనా చికిత్స, తెలంగాణలో కరోనా చికిత్స ధరలు
By
Published : Jun 24, 2021, 6:56 AM IST
కొవిడ్ చికిత్సలకు మళ్లీ పాత ధరలే ఖరారయ్యాయి. 2020 జూన్‌లో ఏ ధరలనైతే స్థిరీకరించారో.. మళ్లీ వాటినే కొనసాగిస్తూ వైద్యఆరోగ్య శాఖ నిర్ణయం తీసుకుంది. ఆ ధరలు తమకు ఏమాత్రం సమ్మతం కాదని.. వాటిని పెంచాలంటూ ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులు చేసిన వినతులను తోసిపుచ్చింది. ఈ దఫా మాత్రం పీపీఈ కిట్, ఇతర నిర్ధారణ పరీక్షల ధరలను స్పష్టీకరించింది. అత్యవసర సేవల్లో వినియోగించే అంబులెన్సు ధరలను కూడా స్థిరీకరించింది. ఈ మేరకు స్వల్ప మార్పులు చేస్తూ వైద్యఆరోగ్యశాఖ తాజాగా ఉత్తర్వులిచ్చింది.
ప్రభుత్వం నిర్దేశించిన ఈ ధరలను కచ్చితంగా అమలు చేయాలని.. అధిక ధరలు వసూలు చేసినట్లుగా తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని ఉత్తర్వుల్లో వైద్యఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ స్పష్టం చేశారు. అవసరం లేకపోయినా మళ్లీ మళ్లీ సీటీ స్కాన్‌లు, ఇతర నిర్ధారణ పరీక్షలు చేయవద్దని.. నిబంధనలను కచ్చితంగా పాటించాలని ఆదేశించారు.
రోగికి మేలే కానీ..
వైద్యఆరోగ్యశాఖ ఇచ్చిన తాజా ఉత్తర్వులు రోగికి మేలు చేసేవే కానీ.. చెల్లుబాటు అవడంపైనే పలు సందేహాలు నెలకొన్నాయి. గతేడాది జీవో ఇచ్చినప్పుడు వాస్తవ దూరంగా ధరలను నిర్ణయించారంటూ ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులు వినతిపత్రాలు అందజేశాయి. పైగా ఏ ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రి కూడా ప్రభుత్వం నిర్ణయించిన ధరలను అమలు చేయలేదు. ఇష్టానుసారంగా చికిత్సల ధరలను వసూలు చేశాయి. ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల ధరల బాగోతంపై ప్రభుత్వానికి పెద్దఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. వాటిపై తూతూమంత్రంగానే చర్యలు తీసుకున్నారన్న విమర్శలు వచ్చాయి. ఇప్పటికీ అధిక ఫీజులపై ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆసుపత్రుల్లో చికిత్సల ధరలను ఖరారు చేస్తూ ఉత్తర్వులివ్వాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో కొవిడ్ చికిత్సల ధరల్లో మార్పులుండొచ్చని అనుకున్నారు. అయితే, ఆరోగ్యశాఖ ఇచ్చిన తాజా ఉత్తర్వుల్లో పాత ధరలనే ఖరారు చేయడంతో.. ఈ ఆదేశాలను ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులు అమలు చేస్తాయా? అనే సందేహాలు నెలకొన్నాయి. వీటిని అమలుచేయడమే అసలైన సవాల్ అని.. అధికారులు దృష్టిసారించకుంటే గతంలో మాదిరిగా నామమాత్రపు ఉత్తర్వుల్లాగానే ఇవీ మిగిలిపోయే అవకాశాలున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇవీ చికిత్స ధరలు.. (రోజుకు)
ఐసొలేషన్, సాధారణ వార్డులో : రూ.4,000
ఐసీయూలో: రూ.7,500
ఐసీయూలో వెంటిలేటర్‌తో: రూ.9,000
ఇవి కూడా కలిపి
కంప్లీట్ బ్లడ్ పిక్చర్, రొటీన్ యూరిన్ పరీక్ష, హెచ్‌ఐవీ, హెపటైటిస్ సి, హెపటైటిస్ బి, సిరమ్ క్రియేటినైన్, అల్ట్రాసౌండ్ స్కాన్, 2డి ఎకో, ఎక్స్‌రే, ఈసీజీ పరీక్షలు సహా అవసరమైన ఔషధాలు, వైద్యుని సంప్రదింపులు, పడకకయ్యే వ్యయం, భోజనాలు, మూత్రనాళంలో గొట్టం తదితర వైద్య ప్రక్రియలు.
వీటికి అదనం
ఇంటర్‌వెన్షనల్ ప్రొసీజర్లు వంటివి ఉదాహరణకు.. బ్రాంకోస్కోపిక్ ప్రొసీజర్లు, సెంట్రల్‌లైన్, కీమోపార్ట్ ఇన్‌సెర్షన్, బయాప్సీ, పొట్టలో నుంచి ద్రవాన్ని తీయడం తదితర వైద్య ప్రక్రియలకు అదనంగా ఛార్జీలు వసూలు చేసుకోవచ్చు. అయితే వీటికి 2019 డిసెంబరు 31 నాటికి ఎంతైతే ధర నిర్ధారించారో.. అంతే వసూలు చేయాలి.
ఇమ్యూనోగ్లోబిన్స్, మెరోపెనిమ్, పేరెంటల్ న్యూట్రిషన్, టొసిలిజుమాబ్ తదితర ఖరీదైన ఔషధాలను ఇవ్వాల్సి వచ్చినప్పుడు వాటికి గరిష్ఠ చిల్లర ధరనే వసూలు చేయాలి.
ఉత్తర్వుల్లో ఇక్కడి వరకూ గతేడాదివే తిరిగి ఇచ్చారు.
కొత్తగా చేరినవి..
ఒక్కో పీపీఈ కిట్ ధర గరిష్ఠంగా రూ.273 మాత్రమే. ఇంతకు మించి వసూలు చేయడానికి వీల్లేదు.
ఈ ఉత్తర్వులు బీమా సంస్థల చెల్లింపులకు వర్తించవు. ఏ తరహా పరస్పర అవగాహన ఒప్పందంతో చికిత్స పొందే విధానాలకైనా ఈ ధరలు వర్తించవని ఉత్తర్వుల్లో వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.
దూరప్రాంతాలకు సాధారణ అంబులెన్సులో వెళ్లాల్సి వస్తే గరిష్ఠంగా కిలోమీటరుకు రూ.75 చొప్పున వసూలు చేయాలి. అదే ఆక్సిజన్, ఇతర వసతులతో కూడిన అంబులెన్సు అయితే కిలోమీటరుకు రూ.125 చొప్పున తీసుకోవాలి.
సాధారణ అంబులెన్సును గుండుగుత్తగా మాట్లాడుకుంటే మినిమమ్ ఛార్జి రూ.2000. ఇతర వసతులున్న అంబులెన్సయితే ఈ మొత్తం రూ.3000