కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పడిపోయింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ప్రజాప్రతినిధులు, ఉద్యోగుల వేతనాల్లో ప్రభుత్వం కోత విధించింది. ప్రజాప్రతినిధుల వేతనాల్లో 75శాతం కోత విధించిన సర్కార్... అఖిల భారతసర్వీసు అధికారులకు 60శాతం, మిగతా వారికి 50శాతం కోత విధించింది. నాల్గో తరగతి ఉద్యోగులకు మాత్రం పది శాతం కోత విధించింది. ఫించనుదార్లకూ ఇదే తరహాలో కోత వర్తించనుంది.
కోత అందరికి
కోత విధిస్తూ జారీ చేసిన ఉత్తర్వులకు అనుగుణంగా రాష్ట్ర ఆర్థిక శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే బిల్లులు జారీ చేసిన వేతనాలకు సంబంధించి కూడా కోత వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఒప్పంద, పొరుగుసేవల సిబ్బంది తరహాలోనే గౌరవవేతనాలు పొందే హోంగార్డులు, అంగన్ వాడీ కార్యకర్తలు, వీఆర్ఓలు, విద్యావాలంటీర్లకు పది శాతం కోత వర్తిస్తుందని తెలిపింది. అన్ని శాఖల ఉద్యోగులకు కోత వర్తిస్తుందని... ఎవరికీ ఎలాంటి మినహాయింపు లేదని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి.