అమరవీరుల త్యాగాలు ప్రతిబింబించేలా.. కళ్ల ముందే మెదిలేలా తెలంగాణ ఉద్యమంలో అసువులు బాసిన వందలాది మంది అమరుల త్యాగాలకు చిహ్నంగా.. ప్రభుత్వం స్మారక స్థూపం నిర్మిస్తోంది. హైదరాబాద్ నడిబొడ్డున లుంబినీ పార్కు వద్ద 7 నెలల క్రితం నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. రూ.80 కోట్ల అంచనా వ్యయంతో విభిన్న రీతిలో స్మారక స్థూపం రూపుదిద్దుకుంటోంది.
దిల్లీ తరహాలో..
అమరులు నిరంతరం కళ్ల ముందే మెదిలేలా.. భారీ భవనాన్ని నిర్మించి.. దానిపై నిత్యం వెలిగేలా జ్యోతిని ఏర్పాటుచేస్తున్నారు. 6 అంతస్థులు ఉండే ఈ భవనంలో కింది రెండు అంతస్థులను పార్కింగ్‌కు కేటాయిస్తున్నారు. 350 కార్లు, 600 ద్విచక్ర వాహనాలు నిలిపే విధంగా వీటిని నిర్మిస్తున్నారు. దిల్లీ తరహాలో హైదరాబాద్‌కు వచ్చిన ప్రముఖులు అమరవీరుల స్థూపాన్ని సందర్శించి... స్మరించుకునేలా స్మారక స్థూపం నిర్మాణం జరుగుతోంది.
సకల సౌకర్యాలతో..
అత్యాధునిక సాంకేతికతో సకల సౌకర్యాలతో స్మారక స్థూపం అందుబాటులోకి రానుంది. 10 మీటర్ల ఎత్తులో ఉండే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటుచేయనున్నారు. భవనానికి రెండు ప్రవేశ ద్వారాలు ఉంటాయి. పార్కింగ్‌పైన ఉన్న మొదటి అంతస్థులో ఫోటో గ్యాలరీ, మ్యూజియంతో పాటు.... 150 మందికి సరిపడా ఆడియో ప్రదర్శనశాల ఉంటుంది. రెండో అంతస్థులో 700 మందికి సరిపడే సామర్థ్యంతో కన్వెన్షన్ హాల్ నిర్మిస్తున్నారు. మూడో అంతస్థులో రెస్టారెంట్ , నాలుగో అంతస్థులో పోడియం నిర్మిస్తున్నారు. ఇక్కడి నుంచి నగర అందాలు వీక్షించే విధంగా వ్యూ పాయింట్ ఉంటుంది. భద్రతా పరంగానూ అత్యాధునిక సాంకేతికతతో ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇవీచూడండి:'సినీనటికి వేధింపులు.. పోలీసులకు ఫిర్యాదు'