తెలంగాణ

telangana

ETV Bharat / city

JOB NOTIFICATION: ఉద్యోగాల భర్తీకి అడుగులు.. ఉద్యోగ సంఘాల వినతులు

ఉద్యోగాల నియామకాలకు రంగం సిద్ధమవుతున్న తరుణంలో.. కేడర్ సంఖ్య ఖరారు సహా ఇతర అంశాలు చర్చనీయాంశమయ్యాయి. గతంలో నిలిచిపోయిన కేడర్ ఖరారు ప్రక్రియ త్వరలో పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు. అటు ఆర్డర్ టు సర్వ్ కింద.. కొత్త జిల్లాల్లో విధులు నిర్వర్తిస్తున్న వారి నుంచి ఐచ్ఛికాలు తీసుకొని పోస్టింగులు ఇవ్వాలని, స్పౌస్‌ కేసుల బదిలీలు చేపట్టాలని.. ఉద్యోగ సంఘాల నేతలు కోరుతున్నారు.

JOB NOTIFICATION IN TELANAGANA
JOB NOTIFICATION IN TELANAGANA

By

Published : Jul 12, 2021, 6:57 AM IST

ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన ప్రక్రియను తక్షణమే చేపట్టాలని.. ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఇప్పటికే ఆదేశించారు. మొదటి దశలో వివిధ శాఖల్లో ఉన్న దాదాపు 50 వేల ఖాళీలను భర్తీ చేయాలన్న సీఎం కేసీఆర్.. పదోన్నతులతో వచ్చే ఖాళీలను తదుపరి దశలో భర్తీ చేయాలని స్పష్టం చేశారు. అందుకు అనుగుణంగా కసరత్తు చేసి మంగళవారం నాటి మంత్రివర్గ సమావేశం ముందు ఉంచాలని.. అధికారులను ఆదేశించారు.

పోస్టుల వర్గీకరణ..

అయితే కొత్త జోనల్ విధానానికి అనుగుణంగా.. కేడర్ స్ట్రెంత్​ను వర్గీకరించాల్సి ఉంది. అన్ని ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగాలను జిల్లాలు, జోన్లు, మల్టీ జోన్ల వారీగా విభజించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన కసరత్తును... ప్రభుత్వం గతంలో ప్రారంభించింది. అన్ని శాఖలు ఆయా జిల్లాల వారీగా పోస్టులను విభజించి పంపాయి. అయితే పోస్టుల వర్గీకరణకు సంబంధించిన ప్రక్రియ మాత్రం ఇంకా పూర్తి కాలేదు. అటు గతంలో స్టేట్ కేడర్ లో ఉన్న డిప్యూటీ కలెక్టర్ పోస్టులను.. ఇప్పుడు మల్టీజోనల్ కేటగిరీకి మార్చారు. అందుకు అనుగుణంగా ఆ పోస్టులను వర్గీకరించి నోటిఫై చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ అంతా పూర్తైతేనే కొత్త జోనల్ విధానం ప్రకారం ఉద్యోగ నియామకాలు చేపట్టాల్సి ఉంటుంది. ఉద్యోగాలు భర్తీ చేయాలన్న ముఖ్యమంత్రి ఆదేశాల నేపథ్యంలో అధికారులు ఆ దిశగా కసరత్తు ప్రారంభించారు. వీలైనంత త్వరగా కేడర్ సంఖ్య ఖరారు ప్రక్రియను పూర్తి చేసి పోస్టులను వర్గీకరించి నోటిఫై చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.

జోనల్​ వ్యవస్థ నేపథ్యంలో..

ములుగు, నారాయణపేట జిల్లాలను జోనల్ విధానంలో చేర్చడం సహా.. వికారాబాద్​ను జోగులాంబ నుంచి చార్మినార్​జోన్​కు మార్చిన నేపథ్యంలో.. అందుకు అనుగుణంగా కొన్ని మార్పులు చేయాల్సి ఉంది. ఈ ప్రక్రియ అంతా వీలైనంత త్వరలోనే పూర్తవుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి.

ఉద్యోగ సంఘాల వినతులు..

అటు కొత్త జిల్లాల ఏర్పాటు సమయంలో... ఆర్డర్ టు సర్వ్ కింద ఉద్యోగులకు పోస్టింగులు ఇచ్చారు. ఆ ప్రకారమే ఉద్యోగులు ఆయా జిల్లాల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. తమను సొంత జిల్లాలకు పంపాలని చాలా మంది ఉద్యోగులు అప్పట్నుంచి కోరుతున్నారు. నియామకాలకు రంగం సిద్ధమవుతోన్న తరుణంలో.. ఆర్డర్ టు సర్వ్ కింద విధులు నిర్వర్తిస్తున్న వారికి ఐచ్ఛికాలు ఇచ్చి సొంత జిల్లాలకు పంపాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. ఈ మేరకు ఇప్పటికే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. అటు భార్యాభర్తలు ఒకే ప్రాంతంలో పనిచేసేలా స్పౌస్‌ కేసుల బదిలీలు చేపట్టాలని... ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలోనే ఆదేశించారు. ఆ ప్రక్రియనూ పూర్తి చేస్తే బాగుంటుందని అంటున్నారు. ఆర్డర్ టు సర్వ్ కింద విధులు నిర్వర్తిస్తున్న వారి నుంచి... ఐచ్ఛికాలు తీసుకొని పోస్టింగ్ ఇవ్వడం, స్పౌస్‌ కేసుల బదిలీలు పూర్తి చేశాక.. నియామక ప్రక్రియ చేపడితే బాగుంటుందని ఉద్యోగసంఘాలు అంటున్నాయి.

మొదటి దశలో 50 వేల ఖాళీలు భర్తీ చేసేందుకు... సీఎం ఆదేశాలు జారీ చేశారు. మిగిలిన కొన్ని ఖాళీల్లో ఒప్పంద, పొరుగుసేవల పద్ధతిన ఉద్యోగాలు చేస్తున్నారు. నియామకాల్లో వారికి ప్రాధాన్యం ఇచ్చేలా... వెయిటేజీ ఇస్తే బాగుంటుందని అంటున్నారు. అన్ని అంశాలను దృష్టిలో ఉంచుకొని ఉద్యోగ నియామకాల విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

ఇవీచూడండి:JOB NOTIFICATION: ప్రభుత్వ శాఖల్లో 55 వేల ఉద్యోగ ఖాళీలు!

ABOUT THE AUTHOR

...view details