Ganesh Chaturthi 2022 : వినాయకుని మట్టి ప్రతిమలను పూజిద్ధాం.. పర్యావరణం కాపాడుదాం.. అనే నినాదంతో ఈ ఏడాది గణేశ్ ఉత్సవాలకు భాగ్యనగరం సిద్ధమవుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు జోన్లు, సర్కిళ్లవారీగా జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ సంయుక్త ఆధ్వర్యంలో... స్వచ్ఛంద సంస్థల సహకారంతో మట్టి గణపతి విగ్రహాల పంపిణీ పెద్ద ఎత్తున సాగుతోంది. రేపు వినాయక చవితి దృష్ట్యా పర్యావరణహిత వినాయక విగ్రహాలు ప్రతిష్టించాలని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ప్రభుత్వం తరఫున 5 లక్షలకుపైగా బంకమట్టితో తయారు చేసిన ప్రతిమలు ఉచితంగా పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు. 200 ప్రాంతాల్లో సిబ్బందితో, వందకుపైగా సంచార వాహనాల్లో వినాయక విగ్రహాలు అందజేస్తున్నారు.
clay Ganesha idols : ఖైరతాబాద్ గణేషుడు పంచముఖ మహాలక్ష్మీ గణపతి రూపంలో సిద్ధమయ్యాడు. 80 రోజులపాటు 150 మంది కళాకారులు శ్రమించి మట్టితో గణనాధుడిని తయారుచేశారు. రేపు ఉదయం గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ చేతుల మీదుగా పూజలు నిర్వహించిన అనంతరం స్వామివారు భక్తులకు దర్శనం ఇవ్వబోతున్నారని గణేశ్ ఉత్సవ కమిటీ వెల్లడించింది.