Discom losses in telangana: విద్యుత్ శాఖ ఆర్థిక స్థితిగతులపై విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు.. మింట్ కాంపౌండ్‌లోని విద్యుత్ సౌధలో వరసగా మూడోరోజు సమీక్ష చేశారు. దిగువ, మధ్యతరగతి ప్రజలకు ఊరట కల్గిస్తున్న సంస్థలను ఆదుకునేందుకుగాను సీఎం కేసీఆర్ ప్రతి సంవత్సరం రూ.1,253 కోట్లతో కలిపి రూ.10,000 కోట్లు సబ్సిడీ రూపంలో అందిస్తున్నా విద్యుత్ పంపిణీ సంస్థలకు నష్టాలు తప్పడంలేదని అధికారులు వివరించారు. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోల్చి చూసినప్పుడు దిగువ మధ్యతరగతి గృహ వినియోగదారులకు 50 యూనిట్లలోపు విద్యుత్‌ను వినియోగించుకుంటున్న వారి నుంచి రాష్ట్రంలో కేవలం రూ.1.45 వసూలు చేస్తుండగా.. గుజరాత్లో రూ.3.30, ఉత్తరప్రదేశ్‌లో మూడు రూపాయలు, పంజాబ్‌లో రూ.3.49, అత్యధికంగా పశ్చిమబంగాలో రూ.4.02 వసూలు చేస్తున్న అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు.
వ్యత్యాస భారం మొత్తం ప్రభుత్వంపై..
power charges in telangana: 100 యూనిట్ల విద్యుత్‌ను వినియోగించుకునే వినియోగదారుల సరాసరి బిల్లు తెలంగాణలో 239 రూపాయలుగా ఉంటే కాంగ్రెస్ పాలిత రాష్ట్రం రాజస్థాన్‌లో రూ.861, భాజపా పాలిత కర్ణాటకలో రూ.702, పశ్చిమ బంగాలో రూ.759, మహారాష్ట్రలో రూ.677, గుజరాత్లో రూ.601, కేరళలో రూ.476, పంజాబ్‌లో రూ.473, ఉత్తరప్రదేశ్‌లో రూ.457 వసూలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. తెలంగాణలో 200 యూనిట్లు వినియోగిస్తున్న ఒక్కో వినియోగదారు నుంచి రూ.822 వసూలు చేస్తున్నట్లు తెలిపారు. మహారాష్ట్రలో అదే 200 లోపు యూనిట్లు వినియోగించుకుంటున్న వినియోగదారుల నుంచి అత్యధికంగా రూ.1,689, రాజస్థాన్‌లో రూ.1,666, పశ్చిమబంగాలో రూ.1,630, కర్ణాటకలో రూ.1,556, మధ్యప్రదేశ్‌లో రూ.1,427, గుజరాత్లో రూ.1,285, కేరళలో రూ.1,224 వసూలు చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ డిస్కంలు ఒక్కో యూనిట్ సరఫరా వ్యయం రూ.7.24 అవుతుండగా.. 50 యూనిట్లలోపు వినియోగదారులకు రూ.1.45, 100 యూనిట్ల వరకు రూ.2.60, 200 యూనిట్లకు రూ.4.30 మాత్రమే గృహ వినియోగదారుల నుంచి వసూలు చేస్తున్నామన్నారు. సరఫరా వ్యయానికి గృహ వినియోగదారులు చెల్లించే మొత్తాలలో ఉన్న వ్యత్యాసాన్ని ప్రభుత్వం భరిస్తుందన్నారు.