ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు మేరకు దేవాదాయ, వక్ఫ్ భూముల రిజిస్ట్రేషన్లు ప్రభుత్వం నిషేధించింది. ప్రభుత్వ నిర్మాణాలకు కూడా... వాటి భూముల్ని కేటాయించరాదని స్పష్టం చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్... ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. రిజిస్ట్రేషన్ల చట్టం "సెక్షన్-22ఏ 1సీ"లో.. దేవాదాయ భూములు, వక్ఫ్ ఆస్తులను చేర్చారు. ఈ ప్రకారం ఆస్తుల విక్రయం, బహుమతి, పదేళ్లకు మించి స్ధిరాస్తుల లీజు, ట్రస్టులని సొంతం చేసుకోవడం చెల్లుబాటుకాదు.
ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని భూములు, ఆస్తుల జాబితాను.. రిజిస్ట్రేషన్లశాఖకు అప్పగించాలని ప్రభుత్వం దేవాదాయశాఖను ఆదేశించింది. ధరణి పోర్టల్‌లో చేర్చి నిషేధిత భూముల జాబితా కింద ఎక్కడా రిజిస్ట్రేషన్లు జరగకుండా అడ్డుకోవాలని సూచించింది. ఈ భూముల సర్వే నంబర్లపై రిజిస్ట్రేషన్లు కాకుండా.. ఆటోలాక్ ఏర్పాటు చేయాలని రిజిస్ట్రేషన్లశాఖను ప్రభుత్వం ఆదేశించింది.