Ban on private practice: కొత్తగా ప్రభుత్వ వైద్యంలో నియమితులయ్యే వైద్యులు ఇక నుంచి ప్రైవేటు ప్రాక్టీసు చేయకూడదు. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. బోధనాసుపత్రుల సేవా నిబంధనలను అనుసరించి.. నేరుగా నియమితులైన క్లినికల్, నాన్ క్లినికల్ విభాగాలకు చెందిన అందరు స్పెషలిస్టు, సూపర్ స్పెషలిస్టు వైద్యులు, బోధనేతర విభాగం నుంచి బదిలీపై వచ్చిన వైద్యనిపుణులు ఇక నుంచి ప్రైవేటు ప్రాక్టీసు నిషేధం పరిధిలోకి వస్తారని వైద్య శాఖ కార్యదర్శి రిజ్వీ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రజారోగ్య విభాగంలో ఎంబీబీఎస్ అర్హతతో సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులో చేరే వైద్యులకు, తెలంగాణ వైద్య విధాన పరిషత్ విభాగాల పరిధిలో స్పెషలిస్టు సివిల్ అసిస్టెంట్ సర్జన్‌లుగా నియమితులు కానున్న వారికి కూడా ఈ నిబంధనలే వర్తిస్తాయి. అయితే ఇప్పటికే ప్రభుత్వ వైద్యంలో పనిచేస్తున్న వైద్యులకు ఇవి వర్తించవు. ప్రజలకు సేవలందించాలనే లక్ష్యమున్నవారే ప్రభుత్వ వైద్యంలో చేరడానికి ఈ ఉత్తర్వులు దోహదపడతాయనీ ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ జి.శ్రీనివాసరావు పేర్కొన్నారు.
ప్రభుత్వ వైద్యుల ప్రైవేట్ ప్రాక్టీసుపై నిషేధం
16:49 June 07
ఉత్తర్వులు జారీ చేసిన వైద్య ఆరోగ్య శాఖ
అర్హతల్లో కీలక సవరణ
సహాయ ఆచార్యుల పోస్టుకు దరఖాస్తు చేసేందుకు ప్రతి విభాగానికి సంబంధించిన విద్యార్హతను తాజా ఉత్తర్వుల్లో పొందుపర్చారు. ఇందులో ఒక కీలక సవరణ చేశారు. గతంలో ఎండీ, ఎంఎస్ పీజీ వైద్య విద్య పూర్తి చేస్తే చాలు.. నేరుగా సహాయ ఆచార్యుల పోస్టుకు అర్హత లభించేది. ఇప్పుడు సవరించిన ఉత్తర్వుల ప్రకారం.. పీజీ వైద్యవిద్య పూర్తి చేసిన అనంతరం తప్పనిసరిగా ఒక ఏడాది పాటు సీనియర్ రెసిడెంట్‌గా సేవలందించాలి. అలాగే డీఎన్‌బీ పీజీ కోర్సులకు సంబంధించి కూడా ఉత్తర్వుల్లో స్పష్టతనిచ్చారు. 500.. ఆ పైన పడకలున్న ఆసుపత్రిలో గనుక డీఎన్‌బీ పీజీ కోర్సు చేస్తే.. ఒక ఏడాది సీనియర్ రెసిడెంట్‌గా చేయాలి. ఒకవేళ 500 లోపు పడకలున్న ఆసుపత్రిలో గనుక చేస్తే.. రెండేళ్ల పాటు సీనియర్ రెసిడెంట్‌గా సేవలందించాలి. అప్పుడే సహాయ ఆచార్యుల పోస్టుకు అర్హత లభిస్తుంది. ప్రైవేటు ప్రాక్టీసు కుదరదంటూ స్పష్టతనిచ్చిన ప్రభుత్వం.. దీనికి పరిహారంగా వేతనాల పెంపుపై మాత్రం ఉత్తర్వుల్లో ఎటువంటి సమాచారాన్ని పొందుపర్చలేదు.
ఇవీ చూడండి:
TAGGED:
Ban on private practice