తెలంగాణలో ఉద్యోగులు, ఉపాధ్యాయుల పరస్పర బదిలీల (మ్యూచువల్)కు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం మార్గదర్శకాలు జారీ చేసింది. దీనిపై జీవో 21 ఇచ్చింది. బదిలీ కోసం వచ్చే నెల ఒకటో తేదీ నుంచి 15 వరకు సమీకృత ఆర్థిక నిర్వహణ, సమాచార విధానం (ఐఎఫ్‌ఎంఐఎస్) వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. నిర్ణీత కాలపరిమితితో వీటిని పూర్తి చేస్తామని తెలిపింది. ఒకే శాఖ, ఒకే హోదా గల వారి మధ్యనే మ్యూచువల్ బదిలీలుంటాయని తెలిపింది. ‘‘ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు కూడా ఒకే యాజమాన్యం, ఒకే కేటగిరి, సబ్జెక్టు, మాధ్యమం చూస్తారు. బోధనేతర సిబ్బందికి సైతం జడ్పీ, ఎంపీ, ఇతర పాఠశాలల్లో పనిచేసే వారికి అదే జడ్పీ, ఎంపీ, ఇతర పాఠశాలల్లో వారితోనే పరస్పర బదిలీలుంటాయి. ఇద్దరు దరఖాస్తు చేసుకుంటే వారు కొత్త జోనల్ విధానం కింద బదిలీ అయినవారు కావాలి. లేదా అందులో ఒక్కరైనా కొత్త విధానం కింద మారిన వారై ఉండాలి’’ అని సూచించింది. దీనికి అనుగుణంగా ప్రక్రియను నిర్వహించాలని అన్ని ప్రభుత్వ శాఖల ప్రత్యేక ప్రధాన, ముఖ్య కార్యదర్శులను సీఎస్ సోమేశ్‌కుమార్ ఆదేశించారు.
- బదిలీ జరిగే వారికి పాత సీనియారిటీ ఉండదు. వారు కొత్తగా చేరే చోట సీనియారిటీలో చివరగా ఉంటారు. ఉదాహరణకు కళ్యాణ్ బదిలీపై జనగామ నుంచి వరంగల్‌కు వెళితే... అప్పటికే అక్కడ సీనియారిటీలో చివరగా ఉన్న కార్తీక్ తర్వాత స్థానంలో ఉండాలి.
- ఉద్యోగుల వినతి మేరకు జరుగుతున్న ఈ ప్రక్రియలో పరస్పర బదిలీలు పొందిన వారికి ఎలాంటి టీఏ, డీఏ ఇవ్వరు.
- కోర్టు ఆదేశాల మేరకు కొనసాగుతున్న వారికి, సస్పెన్షన్‌లో ఉన్న వారికి, క్రమశిక్షణ చర్యలు ఎదుర్కొంటున్న వారికి, దీర్ఘకాలికంగా అనధికారికంగా విధులకు హాజరు గానీ వారికి పరస్పర బదిలీలుండవు.
- ఒక కేడర్‌లో బదిలీ కోరుకునే ఉద్యోగి/అధికారి ఒక్కరితోనే అనుమతి తీసుకొని దరఖాస్తు చేసుకోవాలి. ఎక్కువ మంది లేఖలతో దరఖాస్తు చేసుకుంటే వాటిని అనుమతించరు.
- పరస్పర బదిలీలకు అంగీకార పత్రాలను ఆన్‌లైన్‌లో జత చేయాలి. వాటి ప్రతు (హార్డ్‌కాపీ)లను జిల్లా, జోనల్ శాఖాధిపతులకు అందజేయాలి. ఒకసారి దరఖాస్తు చేసిన తర్వాత మార్పులు, చేర్పులను అనుమతించరు. దరఖాస్తులో తప్పులుంటే వాటికి ఆ ఉద్యోగులే బాధ్యత వహించాలి.
- వచ్చిన దరఖాస్తులను శాఖాధిపతులు పరిశీలించి, బదిలీకి అనుమతిస్తూ తమ శాఖ కార్యదర్శికి ప్రతిపాదనలు పంపాలి. సాధారణ పరిపాలన శాఖ పరిశీలన అనంతరం బదిలీ ఉత్తర్వులు జారీ అవుతాయి.
- ఏ దరఖాస్తునైనా పరిపాలన పరమైన కారణాలతో తిరస్కరించే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది.