తెలంగాణ

telangana

ETV Bharat / city

Insurance : చేనేత కార్మికులకు బీమా.. కార్యాచరణ షురూ - Insurance for weavers in Telangana

రాష్ట్రంలో ఇక నుంచి కుల, చేతి వృత్తుల వారికి బీమా(Insurance) సాయం అందనుంది. రైతు బీమా మాదిరి రూ.5 లక్షల సాయాన్ని ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఏడాది నుంచే ఇది అమల్లోకి రానుంది.

Insurance for handloom workers
చేనేత కార్మికులకు బీమా

By

Published : Jul 5, 2021, 9:29 AM IST

రైతుబీమా మాదిరే..ఇతర కుల, చేతి వృత్తుల వారికి రూ.5 లక్షల బీమా(Insurance) సాయం అందనుంది. ఈ ఆర్థిక సంవత్సరం నుంచే అమలు చేయనున్నారు. చేనేత కార్మికులకు పరిహారం అందించాలని సీఎం సిరిసిల్ల జిల్లాలో అధికారికంగా ప్రకటించడంతో దానిపై కార్యాచరణ ప్రారంభమైంది. రాష్ట్రంలో సుమారు 35,000 చేనేత, 19,000 మరమగ్గ కార్మికుల కుటుంబాలున్నాయి. ఇతర కులవృత్తుల వారికి సైతం త్వరలో వర్తింపజేయనున్నారు.

కారణమేదైనా..

కులవృత్తుల బీమా(Insurance)పై ఇటీవల జరిగిన మంత్రిమండలి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మార్గదర్శకాల కోసం మంత్రిమండలి ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ రెండు సమావేశాలు నిర్వహించి, సీఎం ఆదేశాల అమలుపై చర్చించింది. గత నాలుగేళ్లుగా రైతులకు రూ.అయిదు లక్షల పరిహారం అందుతోంది. ప్రమాదవశాత్తు, ఆత్మహత్యలు సహా ఏ కారణాల వల్ల చనిపోయినా మరణధ్రువీకరణ పత్రం ఆధారంగా ఈ సాయం నాలుగురోజుల్లోనే ఇస్తున్నారు. 18 నుంచి 59 ఏళ్ల వయసు, పట్టాదారు పాసుపుస్తకాలున్న వారు అర్హులు.

ఎవరికి ఇవ్వాలి..

ప్రస్తుతం కులవృత్తుల్లో కల్లుగీత కార్మికులకు మాత్రమే రూ.అయిదు లక్షల పరిహారం అందుతోంది. మిగిలిన కులవృత్తులకు దీనిని వర్తింపజేయడం లేదు. వీటన్నింటిపై రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం ఇటీవల చర్చించింది. ఏయే వృత్తుల వారిని చేర్చాలనే అంశంపై అధికారుల నుంచి సూచనలు కోరింది.

చేనేత కార్మికులకు బీమా..

సీఎం ప్రకటన నేపథ్యంలో చేనేత కార్మికులకు ముందుగా బీమా(Insurance)ను అమలు చేయనున్నారు. ఆ తర్వాత విస్తరించనున్నారని తెలుస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో రైతుల తర్వాత ఎక్కువ ఆత్మహత్యలు చేనేత కార్మికులవే జరిగేవి. అప్పట్లో ప్రభుత్వ, కార్మికుల భాగస్వామ్యంతో రూ. లక్ష బీమా(Insurance) పథకం అమలయ్యేది. బీమా ప్రీమియం చెల్లింపులు సమస్యగా మారాయని 2013లో దీనిని రద్దు చేశారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత చేనేతతో పాటు వృత్తుల వారు ఎవరైనా చనిపోతే సీఎం సహాయనిధి, ఆపద్బంధు ఇతర పథకాల కింద సాయం చేస్తున్నారు. సిరిసిల్లలో ఆత్మహత్యలు జరిగితే మంత్రి కేటీఆర్‌ వారి కుటుంబాలకు సాయం అందిస్తున్నారు.

వర్తింపు ఎలా...

సహకార రంగంలో పేర్లు నమోదైన చేనేత కార్మికులకు బీమా(Insurance) అందుతుంది. సహకారేతర రంగంలోని వారికి సాయంపై మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం తీసుకోవాలి. వారికి ప్రత్యేకంగా నమోదు చేయడం లేదా మగ్గాలు నడిపే వారిని పరిగణనలోనికి తీసుకుని అమలు చేసే అవకాశం ఉంది. ఇతర కులవృత్తుల వారికి ఎలాంటి ధ్రువీకరణలు లేవు. దీంతో వారి పేర్ల్లూ నమోదు చేయాల్సి ఉంది.

ABOUT THE AUTHOR

...view details