రాష్ట్రంలో కొవిడ్ ఉద్ధృతితో ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని... లేకుంటే విపత్తు నిర్వహణ చట్టం, ఐపీసీ కింద చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. అందుకోసం ఆయా విభాగాల అధికారులతో పాటు పోలీసులు రంగంలోకి దిగారు. ప్రజలకు అవగాహన కల్పించడం సహా.. కేసులు నమోదు చేస్తున్నారు.
రోడ్లపై ప్లకార్డులతో అవగాహన
హైదరాబాద్ సరూర్ నగర్‌లో మాస్క్ ధరించని 17 మందిపై పోలీసులు కేసునమోదు చేశారు. ఎల్బీనగర్ కూడలి వద్ద.. మాస్క్ వినియోగించాలంటూ ట్రాఫిక్ పోలీసులు అవగాహన కల్పించారు. జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. తరచూ మాస్కులు లేకుండా తిరిగే వారిని గుర్తించి.. వారితో రోడ్లపై ఫ్లకార్డులు ప్రదర్శించి ప్రజలను చైతన్య పరిచారు.
కూడళ్లలో స్పెషల్ డ్రైవ్
కరోనా నియంత్రణకు ప్రజలు సహకరించాలని.. మాస్కులు తప్పనిసరిగా ధరించాలంటూ.. వరంగల్ ఎంజీఎం కూడలి వద్ద పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. మాస్కులు ధరించని 60 మంది వాహనదారులను గుర్తించి జరిమానా విధించారు. వరంగల్ కమిషనరేట్ పరిధిలో అనుమతులు లేకుండా ఎలాంటి సభలు, సమావేశాలు నిర్వహించొద్దని... సీపీ ప్రమోద్‌కుమార్ స్పష్టం చేశారు.