రాష్ట్రంలో కొబ్బరి తోటల విస్తీర్ణం పెంచాలని రాష్ట్ర ఉద్యానశాఖ తాజాగా నిర్ణయించింది. సాగునీటి వసతి పెరుగుతున్నందున కొబ్బరితోటల పెంపకం దిశగా రైతులను ప్రోత్సహించేందుకు నిధులు కేటాయించింది. కేరళలోని కేంద్రీయ మొక్కలు, పంటల పరిశోధనా సంస్థ (సీపీసీఆర్‌ఐ) తెలంగాణలో సాగుకు అనుకూలంగా ఉండే కొబ్బరి రకాలను సిఫార్సు చేసింది. "ఈ చెట్లలో పొట్టిగా ఉండే రకాలైన కల్పజ్యోతి రకం నాటితే ఒక్కో చెట్టుకు ఏటా 144 కొబ్బరికాయలు కాస్తాయి. కల్పసూర్య రకం చెట్టుకు 123, సంకరజాతి రకం కేర సంకర చెట్టుకైతే 130 కాయలు కాస్తాయి. చంద్రసంకర, కల్ప సంవృద్ధి రకాలు కూడా ఈ రాష్ట్రంలో సాగుకు అనుకూలం’" అని వివరించింది.
"కొబ్బరి తోటలతో ఎకరానికి నికరంగా రూ.80 వేల ఆదాయం వస్తుంది. కొబ్బరి వేసిన తొలి మూడేళ్లలో అంతరపంటలుగా కూరగాయలు, పూలతోటలు సాగుతో అదనపు ఆదాయం వస్తుంది. 4వ ఏడాది నుంచి అంతరపంటగా కోకో సాగుచేస్తే రూ.60 వేల వరకూ వస్తుంది. పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు తదితర జిల్లాల్లో వాతావరణం, నేలలు అనుకూలమని, కొబ్బరి వేస్తే లాభాలొస్తాయని అధ్యయనంలో తేలింది" అని ఉద్యానశాఖ వివరించింది. రాష్ట్రంలో ప్రస్తుతం 1,141 ఎకరాల్లో కొబ్బరి తోటలున్నాయి. ఏటా 68.46 లక్షల కాయలు దిగుబడి వస్తోంది. ఈ తోటల్లో బాగా పొడుగు రకాలనే రైతులు వేశారు. వీటికి ఏటా చెట్టుకు 80 నుంచి 100 కాయలు వస్తున్నాయి.