రాష్ట్రంలో 52 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. వర్షాల కారణంగా ధాన్యంలో తేమశాతం అధికంగా ఉంది. కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు 17శాతం కన్నా అధికంగా తేమ ఉంటే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయదు. ఈ నిబంధనతో ధాన్యంలో తేమను తగ్గించుకునేందుకు రైతులు వారాల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది.
చెల్లించింది రూ.1,702 కోట్లే
5,284 కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటివరకు రూ.3,013కోట్ల విలువ చేసే 16 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. రైతులకు చెల్లించింది రూ.1,702 కోట్లే. ఈనెల నుంచే ధాన్యం కొనుగోలు అధికశాతం కేంద్రాల్లో ప్రారంభమయ్యాయి. ధాన్యం కొనుగోళ్ల కోసం ప్రభుత్వం రూ.15వేల కోట్లను పౌరసరఫరాల శాఖ వద్ద అందుబాటులో ఉంచింది. సాధారణంగా 3-4 రోజుల్లో రైతుల ఖాతాలో సొమ్ము జమచేయాలి. తొలుత కొనుగోలు కేంద్రంలో ధాన్యం తూకం వేసి మిల్లులకు తరలిస్తారు. అక్కడ ధాన్యం అన్‌లోడ్ చేసుకుని పౌర సరఫరాల శాఖ రూపొందించిన ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌లో నమోదుచేస్తారు. ఆ వివరాలు పౌరసరఫరాల శాఖకు వచ్చాక రైతుల బ్యాంకు ఖాతాల్లో సొమ్ము జమ చేస్తారు. మిల్లుల వద్ద అన్‌లోడింగ్, వివరాల నమోదులో జాప్యం కారణంగా చెల్లింపులు ఆలస్యమవుతున్నాయి.
దిగుబడి తగ్గుతుందా
మరోవైపు 131 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేయగా..ఆ పరిస్థితి కనిపించటం లేదు. ప్రభుత్వమే 75 లక్షల మె.టన్నులు కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటివరకు దాదాపు 16 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యమే కొనుగోలు చేసింది. గతనెలలో కురిసిన వర్షాలతో సన్నరకం వరి సాగుచేసిన రైతులు నష్టపోయారు. 20శాతం వరకు దిగుబడి తగ్గుతుందని ప్రభుత్వం అంచనావేసింది. తాజాగా అధికారుల అంచనా ప్రకారం 85.69లక్షల మెట్రిక్ టన్నులకు మించి రాకపోవచ్చన్నది అంచనా. కొనుగోళ్లు పూర్తయ్యేప్పటికి అంతకంటే తగ్గే అవకాశముందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
15 రోజులైనా డబ్బు రాలేదు
రెండెకరాల్లో వరి వేశాను. 101 బస్తాల ధాన్యం వచ్చింది. ఎడవల్లి సొసైటీలో ధాన్యం అమ్మాను. ఇప్పటికి 15 రోజులైనా ఇంతవరకు డబ్బు బ్యాంకులో జమకాలేదు. యాసంగికి పొలం సిద్ధం చేసుకోవాలి. డబ్బు రాక ఇబ్బందిగా ఉంది.