ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల దాదాపు 13 లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లిందని.. రైతులకు పరిహారం చెల్లించాలని తెలంగాణ రైతు సంఘం వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లింది. ఈ మేరకు మాజీ ఎమ్మెల్యేలు జూలకంటి రంగారెడ్డి, నంద్యాల నర్సింహ్మారెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం మంత్రికి వినతిపత్రం సమర్పించింది. వరి, పత్తి, సోయాచిక్కుడు, కంది, ఇతర పంటలు బాగా దెబ్బతిన్నాయని.. ఒక్కో ఎకరానికి వేల రూపాయల పెట్టుబడులు పెట్టి నష్టపోయారన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 40 మంది రైతులు వరదల వల్ల చనిపోయారని.. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో, పంట పొలాల్లో నీరు నిలిచే ఉందని వివరించారు.
పంట రుణాలు రద్దు చేయాలి:
నష్టపోయిన పంటల గణాంకాలు సేకరించి ఎకరాకు 25 వేల రూపాయలు పరిహారం చెల్లించడంతో పాటు నష్టపోయిన రైతుల వానాకాలం పంట రుణాలు రద్దు చేయాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. రైతుబీమా లేని.. చనిపోయిన రైతులకు 5 లక్షలు ఎక్స్‌గ్రేషియో ఇవ్వాలని సూచించారు. తడిసిన పంట ఉత్పత్తులన్నింటినీ పంజాబ్ తరహాలో కనీస మద్దతు ధరలకు ప్రభుత్వం కొనుగోలు చేయాలని కోరారు. ఇన్ని విధాలుగా నష్టపోయిన రైతులకు యాసంగిలో వ్యవసాయం చేయడం కష్టతరమౌతుందన్నారు.