వానాకాలం.. రైతు బంధు వచ్చేది ఎన్నడో..? Rythu Bandhu scheme : వానాకాలం పంటల సాగు సీజన్ త్వరలో ప్రారంభం కానుంది. రుతుపవనాలు ప్రవేశించి వర్షాలు ప్రారంభం కాగానే రైతులు పొలం పనులు వేగవంతం చేస్తారు. పెట్టుబడి సాయం కింద రైతులకు అందిస్తున్న రైతుబంధు పంపిణీపై రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఎలాంటి ప్రకటనా చేయలేదు. నిరుడు మే నెలలోనే నిర్ణయం ప్రకటించిన సర్కార్.. జూన్ 15వ తేదీ నుంచి రైతుల ఖాతాల్లో నగదు జమచేసింది. జూన్ పదో తేదీని కటాఫ్‌గా నిర్ణయించి అప్పటి వరకు పాసుపుస్తకాలు ఉన్నవారికి రైతుబంధు సాయం అందించారు.
Rythu Bandhu scheme in telangana : ఈ ఏడాది వానాకాలం సీజన్ రైతుబంధు పంపిణీ విషయమై ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం వెలువరించలేదు. రుణాల విషయంలో కేంద్ర ప్రభుత్వ ఆంక్షలతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నిధుల సమీకరణకు రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది. పన్నులు, ఇతర రూపాల్లో వస్తున్న ఆదాయంతో ఉద్యోగులకు వేతనాలు, పెన్షన్లు, వడ్డీల చెల్లింపులు, ఆసరా ఫించన్లు, రాయతీలకు సర్దుబాటు చేస్తున్నారు. బిల్లుల చెల్లింపులు, రైతుబంధు సహా ఇతర సంక్షేమ కార్యక్రమాలకు నిధుల లభ్యత ఆటంకంగా మారింది.
Rythu Bandhu scheme News : ఈ ఏడాది అప్పుల మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం ఇంకా తేల్చలేదు. తాత్కాలికంగా కొంత మేర అనుమతించడంతో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం 4 వేల కోట్లను బాండ్ల వేలం ద్వారా సమీకరించుకుంది. దీంతో ప్రభుత్వానికి కొంతమేర ఊరట లభించింది. నిధుల లభ్యతతో వేతనాలు, వడ్డీలు, ఇతర చెల్లింపులు ఆలస్యం కాకుండా పూర్తి చేయడంపై ఆర్థికశాఖ దృష్టి సారించింది. రైతుబంధు సాయం పంపిణీ విషయంపై ప్రభుత్వం ఇంకా ఓ నిర్ణయానికి రాలేదు.
ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకోని తేదీని ఖరారు చేస్తే అందుకు అనుగుణంగా పంపిణీకి ఏర్పాట్లు చేస్తామని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. అటు రుణాల మొత్తానికి సంబంధించి కేంద్రం ఇంకా తేల్చలేదు. ఆర్థికశాఖ ఉన్నతాధికారులు ఇటీవల మరో దఫా దిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వ అధికారులతో సంప్రదింపులు జరిపారు. రాష్ట్ర ప్రభుత్వ వాదనను మరోమారు వినిపించారు. కేంద్రం అభ్యంతరం చెబుతున్న గత రెండేళ్ల బడ్జెటేతర రుణాలను నాలుగేళ్ల పాటు ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలోకి సర్దుబాటు చేసే అవకాశం కనిపిస్తోంది. కేంద్రం తెలిస్తే ఇవాళ బాండ్ల జారీకి అవకాశం ఉంటుంది.