రాష్ట్రంలో రెండేళ్లుగా రైతులు పంటల బీమా పరిహారం కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. వ్యవసాయశాఖ ప్రీమియం రాయితీ ఇవ్వకపోవడం ఇందుకు కారణం. 2018-19, 2019-20.. ఈ రెండేళ్లకు రాష్ట్రం రూ.499 కోట్లు ఇస్తే... రైతులకు రూ.919 కోట్లు వస్తాయి. రైతులు కట్టిన ప్రీమియం సొమ్ముకు అదనంగా రాయితీ కింద రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయనందునే పరిహారం ఇవ్వలేదని ప్రైవేటు బీమా కంపెనీలు స్పష్టం చేశాయి. ప్రస్తుత ఏడాది(2020-21)లో పంటల బీమా పథకం అమలును వ్యవసాయశాఖ నిలిపివేసింది. అంతకుముందు రెండేళ్ల పాటు ఈ పథకం కింద రైతుల తరఫున చెల్లించాల్సిన రాయితీ నిధులు విడుదల చేయకపోవడం చర్చనీయాంశమైంది. 2021-22 బడ్జెట్‌లోనూ పంట బీమాకు నిధులు కేటాయించకపోవడంతో ఈఏడు కూడా సొమ్ములు వస్తాయనే నమ్మకం రైతుల్లో సన్నగిల్లుతోంది
పంటల బీమా సొమ్ము కోసం రైతుల నిరీక్షణ - crop insurance scheme in telangana
తెలంగాణలో పంటల బీమా పరిహారం కోసం రైతులు రెండేళ్లుగా నిరీక్షిస్తున్నారు. 2021-22 బడ్జెట్‌లోనూ పంట బీమాకు నిధులు కేటాయించకపోవడం వల్ల ఈ ఏడూ సొమ్ములు వస్తాయనే నమ్మకం రైతుల్లో సన్నగిల్లుతోంది.
ఏమిటీ రాయితీ..
ప్రధానమంత్రి పంటల బీమా పథకం కింద ఆహార, నూనెగింజల, పప్పుధాన్యాల పంటల విలువలో 2 శాతం మాత్రమే రైతులు ప్రీమియం చెల్లించాలి. ప్రీమియం అంత కన్నా ఎక్కువ శాతముంటే ఆపైన ఉండే సొమ్మును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరిసగం భరించాలి. పత్తి, మిరప, బత్తాయి వంటి వాణిజ్యపంటల విలువలో 5 శాతం సొమ్మును రైతు ప్రీమియంగా కట్టాలి. అంతకన్నా ఎక్కువుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరి సగం భరించాలి. ఉదాహరణకు నారాయణపేట జిల్లాలో 2019-20లో పత్తి ఎకరా పంట విలువ రూ.35 వేలు ఉంది. దీనికి 25 శాతం ప్రీమియంగా రూ.8,750 కట్టాలని వ్యవసాయశాఖ ఖరారు చేసింది. కానీ పథకం నిబంధన ప్రకారం 5 శాతమే అంటే రూ.1,750 మాత్రమే రైతు కట్టారు. మిగిలిన రూ.7 వేలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరిసగం రాయితీగా ఇవ్వాలి. దీనిపై వ్యవసాయశాఖ వర్గాలను సంప్రదించగా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశామని నిధులు విడుదల కాగానే కంపెనీలకు ఇస్తామని తెలిపాయి. రాష్ట్రం విడుదల చేసేదాకా కేంద్రం నుంచి నిధులు రావని కేంద్ర వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి.