రాష్ట్రంలో భూ దస్త్రాల ప్రక్షాళన కార్యక్రమం (ఎల్‌ఆర్‌యూపీ) చేపట్టిన అనంతరం దస్త్రాల్లో స్పష్టత ఉన్న వారికి కొత్త పాసుపుస్తకాలు పంపిణీ చేశారు. ప్రభుత్వం వీరికి మాత్రమే రైతుబంధు, బీమా అమలు చేస్తోంది. పలు సమస్యలతో ముడిపడి ఉన్న భూ దస్త్రాలకు పరిష్కారం చూపాల్సిన రెవెన్యూశాఖ ఇప్పటికీ కచ్చితమైన చర్యలు చేపట్టడం లేదని రైతులు అంటున్నారు. తాజాగా ధరణి, పెండింగ్ భూ సమస్యలపై సీఎం కేసీఆర్ కలెక్టర్లతో సమావేశం నిర్వహించేందుకు సిద్ధమవుతున్న దృష్ట్యా అందరి చూపు పరిష్కార మార్గాలపై పడింది. ఇప్పటికైనా అర్హులైన రైతులందరికీ యాజమాన్య హక్కులు కల్పించి ధరణి పోర్టల్లో నమోదు చేస్తారనే ఆశతో ఉన్నారు.
ఫిర్యాదుకు వేదిక లేదు.. నిర్దిష్ట చర్యలు కరవు
ప్రభుత్వం నిజమైన భూ యజమానులకు పూర్తి హక్కులు కల్పించేందుకు పలు చర్యలు చేపట్టింది. కొత్త రెవెన్యూ చట్టం, ధరణి పోర్టల్‌ను అమల్లోకి తెచ్చింది. రైతులందరికీ హక్కులు, పాసుపుస్తకాలు వచ్చాక చట్టం నిబంధనలు అమలు చేసి ఉంటే బాగుండునని బాధితులు వాపోతున్నారు. కొత్త చట్టంతో భూ సమస్యలను పరిష్కరించే అధికారాలు తహసీల్దార్లు, ఆర్డీవోలు, కలెక్టర్లకు (రెవెన్యూ కేసులు మినహా) లేవు. పెండింగ్ సమస్యలపై ఇటీవల కలెక్టర్లకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇచ్చినట్లే ఇచ్చి తొలగించారు. దరఖాస్తు చేసుకున్న కొందరి ఫోన్లకు సంక్షిప్త సందేశం అందినా దారిచూపలేదు. కొందరు రైతులకు తక్కువ విస్తీర్ణం నమోదుకావడం, వారి పక్కనే ఉన్న రైతుకు ఎక్కువ విస్తీర్ణం నమోదవడం లాంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ధరణి పోర్టల్లోనూ వారి పేరున భూమి ఉండటంతో అసలు రైతులకు నిద్రపట్టడం లేదు. ఇలాంటి వాటిపై ఫిర్యాదుకు అవకాశం లేకుండా పోయింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న భూ సమస్యలపై భూ పరిపాలన ప్రధాన కమిషనర్ ఆదేశాల మేరకు సీసీఎల్‌ఏ అధికారులు పరిశీలన చేస్తున్నారు. వికారాబాద్ జిల్లాలో తాండూరు, బంట్వారం, నిజామాబాద్ జిల్లాలో ఇంద్రవెల్లి, మోర్తాడ్, బోధన్, జగిత్యాల జిల్లాల్లో బీర్‌పూర్, రాయికల్, జగిత్యాల గ్రామీణ మండలాలను ఎంపిక చేసుకుని సమస్యలను అధ్యయనం చేస్తున్నారు. ధరణి పోర్టల్‌కు సంబంధించినవి (పార్ట్-ఎ), పార్ట్-బి సమస్యలను నమోదు చేసి వాటి పరిష్కారానికి ఉన్న మార్గాలను కూడా నమోదు చేస్తున్నారు. పది ప్రధాన సమస్యలను పరిగణనలోకి తీసుకున్నారు. ‘ఈనాడు’కు అందిన సమాచారం మేరకు పలు జిల్లాల్లో దృష్టికొచ్చిన సమస్యలు, వాటికి సూచనలు ఇలా ఉన్నాయి.
పార్ట్-బిలో సమస్యలు - పరిష్కారానికి ఉన్న మార్గాలు
- అధిక విస్తీర్ణం నమోదైనవి/ విస్తీర్ణాలలో కోతలు, ఆన్‌లైన్‌లో సర్వే నంబర్లు, ఖాతాలు లేకపోవడం : ఖాతాదారులకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం ఇవ్వాలి. ఆర్డీవో/అదనపు కలెక్టర్‌లకు పరిశీలన అవకాశం కల్పించి పహాణీ, సేత్వార్ విస్తీర్ణం సరిచూడాలి. డిజిటల్ సంతకం పూర్తికి అధికారాలు ఇవ్వాలి. అవసరమైతే క్షేత్రస్థాయి సర్వే చేపట్టవచ్చు. సమాచారాన్ని తిరిగి పోర్టల్లో నమోదు చేసేందుకు అవకాశం ఇవ్వాలి.
- భూ యజమాని మరణించడం, ఈ పాసుపుస్తకం లేకపోవడం : వారి కుటుంబ సభ్యులకు సర్వే నంబరు ఆధారంగా ఈ- పాసుపుస్తకం జారీకి అవకాశం కల్పించొచ్చు.
- ఖాతా స్పష్టంగా ఉన్నా కేవైసీ, ఆధార్, ఇతర సమస్యలతో డీఎస్ పూర్తికాకపోవడం: డీఎస్ పూర్తికి అవకాశం ఇవ్వాలి.
- ఈ- పాసుపుస్తకం/ డీఎస్ లేనివారు, సాగు భూమిలో ఇళ్లు కట్టుకున్నవారు, ఇతర కారణాలతో నాలా అనుమతి రానివారు :సిటిజన్ లాగిన్‌లో సర్వే నంబరుతో దరఖాస్తుకు అవకాశం కల్పించాలి.
పార్ట్ ఏ లో సమస్యలు... పరిష్కారానికి ఉన్న మార్గాలు
- ధరణికి ముందు మ్యుటేషన్, డిజిటల్ సిగ్నేచర్ (డీఎస్) నిలిచిపోయినవి: పెండింగ్ మ్యుటేషన్ మాడ్యూల్‌లో వీటికి దరఖాస్తు అవకాశం లేదు కాబట్టి ప్రత్యేక మార్గం ఉండాలి.
- స్లాటు నమోదులో ఎర్రర్ చూపుతున్నవి, దస్త్రాలు స్పష్టంగా ఉన్నా ఇతర సమస్యలతో రిజిస్ట్రేషన్ కావడం లేదు: ఒకే సర్వే నంబరులో ఎక్కువ మంది రైతులు ఉంటే..అందులో ఒకరి భూమి ఏదేని కారణంతో బ్లాక్‌లో ఉంటే మిగిలిన వారికి రిజిస్ట్రేషన్ పూర్తయ్యేలా ప్రత్యేక ఐచ్ఛికం ఇవ్వాలి.
- అపరిష్కృత మ్యుటేషన్లు- సర్వే నంబరు, క్రయ విక్రయ దారుల పేర్లు సరిపోలకపోవడం లాంటి సమస్యలతో దరఖాస్తులు తిరస్కరానికి గురవుతున్నాయి. ఇలాంటి వాటికి ప్రత్యేక ఐచ్ఛికాలు ఇవ్వాలి.
- ఇదీ చూడండి :ప్రభుత్వ ఉద్యోగులతో తెరాసది పేగుబంధం: కేటీఆర్